Sunder Pichai: ‘ది వాల్ స్ట్రీట్ జర్నల్’కు తలనొప్పిగా మారిన అక్షరదోషం !
- సుందర్ పిచాయ్ పేరు తప్పుగా రాసిన వైనం
- సొంత పాఠకుల నుంచే కాక ప్రజల నుంచి కూడా సెటైర్స్
- ‘పించాయ్’ తెచ్చిన తిప్పలు
ప్రపంచ వ్యాప్తంగా పేరున్న ఇంగ్లీష్ పత్రికల్లో ‘ది వాల్ స్ట్రీట్ జర్నల్’ ది ప్రత్యేక స్థానం. అయితే తాజాగా ఆ పత్రికలో దొర్లిన ఓ అక్షర దోషంతో తమ పాఠకుల నుంచే కాక, ప్రజల నుంచి కూడా సెటైర్స్ ఎదుర్కొంటోంది. గూగుల్ మాతృ సంస్థ ‘ఆల్ఫాబెట్’కు ఇప్పటివరకు గూగుల్ సీఈఓగా పనిచేసిన సుందర్ పిచాయ్ ను నియమిస్తూ గూగుల్ అధినేతలు లారీపేజ్, సెర్గీ బ్రిన్ లు నిర్ణయం తీసుకున్నారు.
ఈ విషయాన్ని మిగిలిన పత్రికలతో పాటు ‘ది వాల్ స్ట్రీట్ జర్నల్’ కూడా మొదటి పేజీలో ప్రచురించింది. అయితే అందులో పిచాయ్ కి బదులుగా ‘పించాయ్’ అని ప్రింట్ అయింది. ఆంగ్ల భాషలో ‘పించ్’ అంటే గిల్లడం అని అర్ధం. దీంతో సోషల్ మీడియా వేదికగా జోక్ లు, సెటైర్స్ వెల్లువెత్తుతున్నాయి. కొందరైతే ఒక అడుగు ముందుకేసి గూగుల్ సీఈఓ పేరు గూగుల్ లోనే సరిగా వెతికితే పోయేదేమో అంటూ కామెంట్స్ చేశారు. దీంతో ‘పించాయ్’ వ్యవహారం వాల్ స్ట్రీట్ వారికి తలనొప్పిగా మారింది.