Janasena: నరుకుతామంటే ‘వెల్ అండ్ గుడ్.. వెల్ కమ్’: జనసేన నేత వ్యాఖ్యలపై రాప్తాడు ఎమ్మెల్యే ప్రకాశ్ రెడ్డి
- ప్రకాశ్ రెడ్డినే కాదు ఏ రెడ్డిని నరుకుతామన్నా వెల్ కమ్
- పవన్ పక్కనే ఉండి ఈ మాటలు మాట్లాడించారు
- సాకే పవన్ ఈవిధంగా ఎందుకు వ్యాఖ్యలు చేశాడో?
జనసేన నాయకుడు సాకే పవన్ చేసిన వ్యాఖ్యలు ఏపీలో దుమారం రేపాయి. ఈ వ్యాఖ్యలను వైసీపీ నేతలు తప్పుబట్టారు. రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి స్పందిస్తూ, ప్రకాశ్ రెడ్డినే కాదు జిల్లాలో, రాష్ట్రంలో ఏ రెడ్డిని నరుకుతామన్నా ‘వెల్ అండ్ గుడ్.. వెల్ కమ్’ అని అన్నారు. ‘పవన్ కల్యాణ్ గారు పక్కనే ఉండి ఈ మాటలు మాట్లాడించినారు. ‘ఈ మాట తప్పు’ అని అంటారని ఎక్స్ పెక్ట్ చేశాం. కానీ అలా జరగలేదు..’ అన్నారు.
అసలు సాకే పవన్ కుమార్ అన్న వ్యక్తి ఎవరో తమకు తెలియదని, ఈ వ్యాఖ్యలు విన్న తర్వాత అతని గురించిన సమాచారం తెలుసుకోవడానికి పది నిమిషాల సమయం పట్టిందని చెప్పారు. సాకే పవన్ ఈ విధంగా ఎందుకు వ్యాఖ్యలు చేశాడో, ఏం బాధ కలిగిందో తమకు తెలియదని అన్నారు.
గత ఎన్నికల్లో సాకే పవన్ పోటీ చేశారట, రామగిరి మండలంలోని కుంటిమద్ది గ్రామానికి చెందిన వ్యక్తి అని, ముప్పై ఏళ్ల క్రితం అనంతపురం వచ్చేశారని, వీల్ అలైన్ మెంట్ షాపు పెట్టుకుని అతను సెటిల్ అయినట్టు తెలిసిందని తోపుదుర్తి చెప్పారు. సాకే పవన్ కు ఎమ్మెల్యేగా పోటీ చేసే స్థాయి లేదని, అతనికి పరిటాల సునీత కుటుంబీకులే జనసేన తరఫున టికెట్ ఇప్పించారని చెప్పారు.
వల్లభనేని వంశీ మాట్లాడిన మాటలను ఓసారి గుర్తుచేసుకోవాలని, టీడీపీ వారి చేతుల్లోకి జనసేన బీఫామ్స్ వచ్చాయని ఆయన చెప్పిన విషయాన్ని ప్రకాశ్ రెడ్డి ప్రస్తావించారు. సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఎక్కడా కూడా కక్షలు, కార్పణ్యాలకు తావు లేకుండా, కులాలు, మతాలకు, రాజకీయాలకు అతీతంగా అందరికీ న్యాయం చేసే ప్రయత్నం చేస్తున్నామని అన్నారు. టీడీపీ వాళ్లు చాలా చోట్ల తమను రెచ్చగొట్టే విధంగా ప్రవర్తిస్తున్నప్పటికీ ఓర్పుగా వుంటూ, పోలీసుల ద్వారా ముందుకెళ్తున్నామని తోపుదుర్తి చెప్పారు.