Cricket: ధోనీ నుంచి పంత్ నేర్చు కోవాల్సింది చాలా ఉంది: గంగూలీ
- మైదానంలో ధోనీ నినాదాలు వింటూ ఒత్తిడిని అధిగమించాలి
- ధోనీ సాధించింది పంత్ సాధించాలంటే పదిహేనేళ్లు పడుతుంది
- ధోనీ వీడ్కోలు అంశాన్ని పక్కన బెట్టండి
తనకే సొంతమైన ప్రత్యేక శైలి ఆటతో భారత జట్టులోకి వచ్చిన యువ క్రికెటర్ రిషభ్ పంత్ మైదానంలో ధోనీ నినాదాలు వినేందుకు అలవాటు పడాలని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ అన్నారు. గంగూలీ మీడియాతో మాట్లాడారు. వాటికి అలవాటు పడుతూనే ఒత్తిడి నుంచి బయటపడేందుకు మార్గం వెతకాలని సూచించారు.
‘ఆ నినాదాలు పంత్ కు మంచివే. వాటికి అతడు అలవాటు పడాలి. అవి వింటూనే సక్సెస్ ను అందుకోవడానికి దారిని అన్వేషించాలి. ఒత్తిడిని ఎదుర్కొంటూనే అతడు క్రికెట్లో తన ముద్ర వేయాలి. ప్రతిసారీ మనకు ధోనీ అందుబాటులో ఉండడు. ధోనీ సాధించింది పంత్ సాధించాలంటే 15 ఏళ్లు పడుతుంది. ధోనీ వీడ్కోలు సంగతి పక్కన పెట్టండి. మేము, కోహ్లీ, సెలెక్టర్లతో మాట్లాడుతున్నాం. సమయం వచ్చినప్పుడు పూర్తి వివరాలు ప్రకటిస్తాం’ అని గంగూలీ చెప్పారు. ఇదిలా ఉండగా, కావాలని ఎవరూ పొరపాట్లు చేయరంటూ... కెప్టెన్ కోహ్లీ, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ పంత్ కు మద్దతు తెలిపిన విషయం తెలిసిందే.