Ravishastri: రవిశాస్త్రిపై కక్షపూరితంగా వ్యవహరిస్తాననడంలో అర్థంలేదు: గంగూలీ

  • గతంలో గంగూలీ, రవిశాస్త్రి మధ్య విభేదాలు
  • కోచ్ పదవి చేజారడానికి గంగూలీయే కారణమన్న శాస్త్రి
  • అప్పట్లో దీటుగా బదులిచ్చిన గంగూలీ

గతంలో సౌరవ్ గంగూలీ బీసీసీఐ క్రికెట్ సభ్యుడిగా ఉన్నప్పుడు రవిశాస్త్రి కోచ్ ఇంటర్వ్యూల కోసం వచ్చారు. కానీ ఆ సమయంలో గంగూలీ టీమిండియా కోచ్ గా అనిల్ కుంబ్లేకు ఓటేశారు. దాంతో రవిశాస్త్రి తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ గంగూలీ వల్లే తనకు కోచ్ పదవి దక్కలేదని బాహాటంగా విమర్శించారు. గంగూలీ కూడా దీటుగానే బదులిచ్చారు. ఆనాటి సంఘటనలపై గంగూలీ తాజాగా స్పందించారు.

బీసీసీఐ అధ్యక్షుడిగా ఎన్నికైన దాదా దీనిపై మాట్లాడుతూ, గత విభేదాలను తాను పట్టించుకోనని, అప్పటి స్పర్ధలను దృష్టిలో పెట్టుకుని రవిశాస్త్రిపై కక్ష సాధిస్తాననడంలో అర్థంలేదని అన్నారు. రవిశాస్త్రిని లక్ష్యంగా చేసుకుంటానని వస్తున్న కథనాలు నిజం కాదని, అందుకే వాటిని పుకార్లు అంటారని వ్యాఖ్యానించారు. అలాంటి ఊహాగానాలకు తన వద్ద జవాబులు ఉండవని పేర్కొన్నారు. ఎవరైనా పనితీరు బాగుంటేనే పదవిలో కొనసాగుతారని, తాము కోరుకునేది ఫలితాలనే అని స్పష్టం చేశారు. రవిశాస్త్రి, విరాట్ కోహ్లీ జోడీ మెరుగైన ఫలితాలు సాధించేందుకు తాము ఎల్లప్పుడూ ప్రోత్సహిస్తామని చెప్పారు.

  • Loading...

More Telugu News