Supreme Court: పోలీసులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి: 'దిశ' నిందితుల ఎన్ కౌంటర్ పై సుప్రీంకోర్టులో పిటిషన్
- పిటిషన్ వేసిన న్యాయవాదులు జీఎస్ మణి, ప్రదీప్ కుమార్ యాదవ్
- దర్యాప్తు జరిపి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి
- '2014 సుప్రీంకోర్టు మార్గ దర్శకాల'ను పాటించలేదని అభ్యంతరం
రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ చటాన్‌పల్లి సర్వీస్ రోడ్డు సమీపంలో దిశను దహనం చేసిన ప్రాంతంలోనే నిందితులు పోలీసు ఎన్ కౌంటర్ లో మరణించిన విషయం తెలిసిందే. ఈ ఎన్ కౌంటర్ పై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలయింది.
పోలీసులపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు జరిపి చర్యలు తీసుకోవాలని కోరుతూ న్యాయవాదులు జీఎస్ మణి, ప్రదీప్ కుమార్ యాదవ్ ఈ పిటిషన్ దాఖలు చేశారు. 2014లో ఎన్ కౌంటర్ విషయంపై సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గ దర్శకాలను పోలీసులు పాటించలేదని వారు అందులో పేర్కొన్నారు.
కాగా, చటాన్‌పల్లి సర్వీస్ రోడ్డు బ్రిడ్జి కింద గత నెల 28వ తేదీ తెల్లవారు జామున పెట్రోల్ పోసి దిశను దహనం చేసిన విషయం తెలిసిందే. ఈ దారుణ ఘటనలో చర్లపల్లి కేంద్ర కారాగారంలో జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్న లారీ డ్రైవర్లు మహ్మద్ ఆరిఫ్, చింతకుంట చెన్న కేశవులు, క్లీనర్లు జొల్లు శివ, జొల్లు నవీన్‌లు పోలీసు ఎన్ కౌంటర్ లో మరణించారు.