priyanka gandhi: మాకు మద్దతుగా పోరాడతామని ప్రియాంకా గాంధీ చెప్పారు.. మృగాళ్లకు మరణశిక్ష వేయాలి: ఉన్నావో కేసు బాధిత కుటుంబం
- బాధితురాలి కుటుంబ సభ్యులను పరామర్శించిన ప్రియాంకా గాంధీ
- ఆ కుటుంబానికి న్యాయం కోసం పోరాడతామన్న ప్రియాంక
- బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు
ఉత్తరప్రదేశ్ లోని ఉన్నావో అత్యాచార బాధితురాలి మృతిపై స్పందించిన కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకా గాంధీ.. ఈ రోజు ఆ ప్రాంతానికి వెళ్లి బాధితురాలి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ విషయంపై బాధితురాలి వదిన మీడియాతో మాట్లాడారు. 'మా కుటుంబానికి న్యాయం జరగడం కోసం, మాకు మద్దతుగా పోరాడతానని ప్రియాంకా గాంధీ తెలిపారు. మా డిమాండ్ ఒక్కటే... మృగాళ్లకు మరణశిక్ష పడాలి.. అప్పుడే బాధితురాలి ఆత్మకు శాంతి చేకూరుతుంది' అని చెప్పింది. అంతకుముందు బాధితురాలి మరణంపై ప్రియాంకా గాంధీ విచారం వ్యక్తం చేశారు. బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.
కాగా, ఉన్నావోకు చెందిన ఆ యువతిపై గతేడాది పెళ్లి పేరుతో ఓ యువకుడు అత్యాచారం చేశాడు. ఈ విషయంపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ మృగాడు బెయిల్ పై బయటకు వచ్చాడు. గురువారం ఉదయం కోర్టు విచారణ నిమిత్తం బాధితురాలు ఒంటరిగా బయలుదేరింది. ఆ సమయంలో బాధితురాలిపై ఐదుగురు వ్యక్తులు దాడి చేసి ఒంటికి నిప్పంటించడంతో, ఆమె తీవ్ర గాయాలపాలైంది. ఆసపత్రిలో చికిత్స పొందుతూ నిన్న రాత్రి ప్రాణాలు కోల్పోయింది. 2017లో ఉన్నావోలో జరిగిన అత్యాచారం ఘటన, ఈ తాజా ఘటన వేర్వేరు. 2017 ఘటనలో బీజేపీ నేత కుల్దీప్ సెంగార్ ప్రధాన నిందితుడిగా ఉన్న విషయం తెలిసిందే.