KCR: కేంద్రం తెలంగాణకు ఇవ్వాల్సిన పన్నుల వాటా విడుదల చేయాలి: సీఎం కేసీఆర్
- కేంద్ర ప్రభుత్వంపై అసంతృప్తి
- వాస్తవాలను వెల్లడించాలని డిమాండ్
- కేంద్రం వాటాగా రూ.19,719 కోట్లు రావాలన్న కేసీఆర్
కేంద్రం నుంచి తెలంగాణకు భారీ మొత్తంలో పన్నుల వాటా రావాల్సి ఉందని సీఎం కేసీఆర్ అంటున్నారు. తమకు రావాల్సిన నిధుల వాటాను ఇవ్వాల్సిందేనని, లేకపోతే వాస్తవాలను వెల్లడించాలని డిమాండ్ చేశారు. ఆర్థికమాంద్యం లేదని కేంద్రం చెబుతున్న వాదనల్లో నిజం లేదని అన్నారు. 2019-20కి కేంద్రం వాటాగా రూ.19,719 కోట్లు రావాలని వెల్లడించారు. గడచిన 8 నెలల్లో రాష్ట్రానికి అందింది రూ.10,558 కోట్లేనని, గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే రూ.224 కోట్లు తక్కువగా వచ్చాయని వివరించారు.
పార్లమెంటులో మంత్రులు చెబుతున్న మాటలకు, వాస్తవ పరిస్థితులకు పొంతనే లేదని కేసీఆర్ విమర్శించారు. ఈ పరిస్థితి ఇలాగే ఉంటే మరింత ఆందోళనకరంగా మారుతుందని అన్నారు. ఇటు రాష్ట్ర పరిస్థితి గురించి మాట్లాడుతూ, కేంద్రం నుంచి రావాల్సిన వాటా తగ్గడంతో అన్ని శాఖలకు నిధులు తగ్గించాలని అధికారులకు సూచించారు. అన్ని శాఖల ఖర్చుల్లో కోతలు పెట్టాలని, నియంత్రణ పాటించాలని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ లోపభూయిష్ట విధానాలే అందుకు కారణమని ఆరోపించారు. త్వరలోనే ఢిల్లీ వెళ్లి ప్రధానమంత్రిని, ఆర్థికమంత్రిని కలిసి పరిస్థితిని వివరిస్తానని తెలిపారు.