Talasani: పైశాచిక నేరాలకు అదే శిక్ష: హెచ్చరించిన తలసాని

  • దారుణాలకు పాల్పడే వారికి స్పష్టమైన మెసేజ్
  • ఇకపై విచారణలు, జైలు, బెయిల్ ఉండవు
  • తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్

తెలంగాణ రాష్ట్రంలో అత్యాచారాలు చేసే వారికి కఠిన శిక్షలు ఉంటాయని, అది ఎన్ కౌంటర్ కూడా కావచ్చని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వ్యాఖ్యానించారు. వెటర్నరీ డాక్టర్ పై హత్యాచారం కేసులో నలుగురు నిందితులనూ కాల్చి చంపడంపై ఆయన స్పందించారు. అత్యంత పాశవికంగా దారుణాలకు పాల్పడేవారికి పోలీస్ ఎన్ కౌంటరే సరైన శిక్షని ఆయన అన్నారు. "ఇది ఓ పాఠం. మీ ప్రవర్తన బాగాలేకుంటే, మీకు కోర్టుల్లో విచారణ, జైలు శిక్ష, ఆపై బెయిలు, కేసులను సాగదీయడం ఇవేమీ ఉండవు. ఇకపై అటువంటివి జరుగవు కూడా. ఈ ఘటనతో మేము సమాజానికి ఓ స్పష్టమైన మెసేజ్ ని పంపించాం. ఎవరైనా దారుణ నేరాలకు పాల్పడితే, వారికి ఎన్ కౌంటరే శిక్ష" అని తలసాని వ్యాఖ్యానించారు.

రాష్ట్రంలో శాంతి భద్రతలను అదుపులో ఉంచాలన్నది తమ సీఎం కేసీఆర్ లక్ష్యమని తలసాని వ్యాఖ్యానించారు. అత్యాచార నిందితులపై పోలీసులు జరిపిన ఎన్ కౌంటర్, దేశవ్యాప్తంగా పోలీసులందరికీ దిశా నిర్దేశమైందని అన్నారు. కేవలం సంక్షేమ పథకాల్లోనే కాకుండా, ఇటువంటి శిక్షల విషయంలోనూ తెలంగాణ ఆదర్శంగా నిలిచిందని అభిప్రాయపడ్డారు.

కాగా, తెలంగాణ రవాణా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సైతం ఇదే విధమైన అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. వేగంగా న్యాయం జరుగుతుందన్న నమ్మకాన్ని ప్రజల్లో కలిగించామని అన్నారు. బాధితురాలి కుటుంబానికి ఎన్ కౌంటర్ తరువాత ఎంతో కొంత ఊరట కలిగివుంటుందని వ్యాఖ్యానించారు. ఈ ఎన్ కౌంటర్ పై మిశ్రమ స్పందన వస్తున్న సంగతి తెలిసిందే. సత్వర న్యాయం పేరిట, ప్రజల్లో అగ్రహం ఉందన్న కారణంతో, ఎటవంటి విచారణ జరుపకుండా నిందితులను చంపేయడం రాజ్యాంగ విరుద్ధమని మానవ హక్కుల సంఘాల ప్రతినిధులు, సీనియర్ న్యాయవాదులు విమర్శలు గుప్పిస్తున్నారు.

  • Loading...

More Telugu News