North Korea: మూసేశామన్న రాకెట్ టెస్టింగ్ గ్రౌండ్ ను తిరిగి తెరచిన నార్త్ కొరియా... ముఖ్యమైన పరీక్షలు జరిపామన్న కేసీఎన్ఏ!
- 'చాలా ముఖ్యమైన' పరీక్ష జరిగింది
- ప్రత్యేక కథనం ప్రచురించిన కేసీఎన్ఏ
- దాదాపు ఏడాది తరువాత సొహేయ్ నుంచి పరీక్షలు
ఉత్తర కొరియా సైంటిస్టులు 'చాలా ముఖ్యమైన' పరీక్షను సొహేయ్ శాటిలైట్ లాంచ్ స్టేషన్ నుంచి జరిపారు. ఈ విషయాన్ని దేశ అధికార మీడియా 'కేసీఎన్ఏ' ఓ ప్రత్యేక కథనం ద్వారా ఆదివారం నాడు ప్రచురించింది. ఇదే శాటిలైట్ లాంచ్ స్టేషన్ ను మూసివేస్తున్నట్టు అమెరికాకు ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ వెల్లడించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు దాన్నే తిరిగి తెరచి, ఈ పరీక్షను నిర్వహించడం కలకలం రేపుతోంది. ఉత్తర కొరియాపై ఆంక్షలు విధించిన తరువాత ఎటువంటి పరీక్షల జోలికీ వెళ్లని అధికారులు, దాదాపు సంవత్సరం తరువాత ఈ పరీక్షను నిర్వహించారు.
ఈ టెస్ట్ విజయవంతం అయిందని, దేశం మరింత బలోపేతమైందని కేసీఎన్ఏ వెల్లడించింది. దేశ రక్షణలో ఈ పరీక్షలు కొత్త దారులను చూపాయని పేర్కొంది. కాగా, నార్త్ కొరియా తాజా టెస్ట్ విషయంలో స్పందించేందుకు సౌత్ కొరియా అధికారులు నిరాకరించారు. ఇక్కడ ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్ ను పరీక్షించి చూసినట్టు తెలుస్తోంది. దీనిపై అధికారిక సమాచారం లేనప్పటికీ, రాకెట్ ఇంజన్ ను మాత్రమే పరీక్షించారని తెలుస్తోంది.