Tamilnadu: దీర్ఘకాలం పాటు వైకుంఠ ద్వారాలను తెరిచేందుకు... శ్రీరంగం వెళ్లి చూసొచ్చిన టీటీడీ ఈఓ!
- తమిళనాడులో ఉన్న శ్రీరంగం ఆలయం
- వైకుంఠ ఏకాదశి నుంచి పది రోజుల పాటు వైకుంఠ దర్శనం
- వెళ్లి పరిశీలించి వచ్చిన అనిల్ కుమార్ సింఘాల్
తమిళనాడులోని శ్రీరంగంలో ఉన్న ప్రఖ్యాత దేవాలయం. శ్రీరంగనాధుడు, రంగనాయకి కొలువైన వైష్ణవ దివ్యక్షేత్రం. 7 ప్రాకారాలు, 21 గోపురాలతో విరాజిల్లుతూ, నిత్యమూ వేలాది మంది భక్తులను ఆకర్షిస్తూ ఉంటుంది. ఈ ఆలయానికి ఉన్న విశిష్ఠతల్లో ఒకటి వైకుంఠ ద్వారా దర్శనం. వైకుంఠ ఏకాదశి పర్వదినం నుంచి ఆలయంలో వైకుంఠ ద్వారాలను పది రోజుల పాటు తెరచివుంచుతారు. ఆ సమయంలో లక్షలాది మంది స్వామిని దర్శించుకుని పునీతులవుతుంటారు.
ఇక తిరుమలలోనూ వైకుంఠ ఏకాదశి పర్వదినం నుంచి పది రోజుల పాటు వైకుంఠ ద్వారాన్ని తెరచి వుంచాలని టీటీడీ అధికారులు యోచిస్తున్నారన్న సంగతి తెలిసిందే. దీనిపై తుది నిర్ణయం తీసుకునేముందు శ్రీరంగం వెళ్లి, అక్కడి పద్ధతిని, ఆగమ నిపుణులను కలుసుకుని సలహాలు, సూచనలు తీసుకోవాలని భావించిన టీటీడీ ఈఓ అనిల్ కుమార్ సింఘాల్, ఆలయాన్ని సందర్శించారు.
వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లు, పది రోజుల పాటు ద్వారాలను తెరచివుంచే విధానాన్ని అడిగి తెలుసుకున్నారు. ఆపై మీడియాతో మాట్లాడిన ఆయన, అతి త్వరలోనే టీటీడీ అధికారులు, ఆగమ శాస్త్ర నిపుణులతో సమావేశమై వైకుంఠ ద్వారాలపై తుది నిర్ణయం తీసుకుంటామని అన్నారు. కాగా, జనవరి తొలి వారంలో వైకుంఠ ఏకాదశి పర్వదినం రానున్న సంగతి తెలిసిందే.