Andhra Pradesh: మూడేళ్లలో మద్యాన్ని రాష్ట్రం నుంచి వెలివేయడమే మా లక్ష్యం: మంత్రి నారాయణస్వామి
- అనర్థాలకు కారణం మద్యమేనన్న మంత్రి
- 43 వేల బెల్టు షాపులు తొలగించినట్టు వెల్లడి
- మద్యాన్ని ఆదాయవనరుగా చూడడంలేదని స్పష్టీకరణ
మహిళలకు ఇచ్చిన మాట కోసమే సీఎం జగన్ మద్యపాన నిషేధం దిశగా చర్యలు తీసుకుంటున్నారని ఏపీ మంత్రి నారాయణస్వామి తెలిపారు. గుంటూరు జిల్లా కొరిటెపాడులో మద్య విమోచన ప్రచార కమిటీ రాష్ట్ర కార్యాలయాన్ని ప్రారంభించిన సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, సమాజంలో అనేక అనర్థాలకు మద్యమే కారణమని అన్నారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో 43 వేల బెల్టు షాపులు తొలగించామని చెప్పారు.
మూడేళ్లలో మద్యాన్ని రాష్ట్రం నుంచి వెలివేయడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. మద్యం అక్రమరవాణా నివారణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని, తమ ప్రభుత్వం మద్యాన్ని ఓ ఆదాయ వనరుగా చూడడంలేదని మంత్రి ఉద్ఘాటించారు. మద్య నిషేధానికి తూట్లు పొడిచేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు.