Jagan: డ్రామా నాయుడు గారు కూడా ఆ మాట అన్నారు అధ్యక్షా!: అసెంబ్లీలో జగన్ వ్యంగ్యం
- ఇంతకు ముందు అచ్చెన్నాయుడు మాట్లాడారు
- ఆయనతో పాటు ఇంకొకరు కూడా ఓ మాట అన్నారు.
- రామానాయుడు కూడా మాట్లాడారు
- శ్రీకాకుళంలో మాత్రమే నాణ్యమైన బియ్యం ఎందుకు అమలు చేస్తున్నారన్నారు
ఏపీ ప్రభుత్వం సరఫరా చేస్తోన్న బియ్యంపై టీడీపీ నేతలు చేస్తోన్న విమర్శలకు ఏపీ సీఎం జగన్ కౌంటర్ ఇచ్చారు. ఈ రోజు ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ... 'ఇంతకు ముందు అచ్చెన్నాయుడితో పాటు ఇంకొకరు కూడా ఓ మాట అన్నారు.. రామానాయుడు కూడా అన్నారు.. డ్రామా నాయుడు గారూ కూడా అన్నారు అధ్యక్షా. ఏమన్నారంటే.. నాణ్యమైన బియ్యాన్ని అందించే కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఎందుకు అమలు చేయలేదు? శ్రీకాకుళంలో మాత్రమే ఎందుకు అమలు చేస్తున్నారు? అన్నారు.
అంటే వారికీ అర్థమైపోతోంది.. శ్రీకాకుళంలో మేము మంచి నాణ్యమైన బియ్యం అందిస్తున్నామని. చంద్రబాబు హయాంలో మొత్తం కొనుగోలు చేసి గోడౌన్ లలో పెట్టారు. మేము మాత్రం స్వర్ణ బియ్యాన్ని, నాణ్యమైన బియ్యాన్ని సరఫరా చేయమని ఆదేశాలు ఇచ్చాం. రూ.1400 కోట్లు ఖర్చు చేసి స్వర్ణ బియ్యం అందిస్తున్నాం' అని జగన్ చెప్పారు.
'చంద్రబాబు హయాంలో బియ్యం సరఫరాలో నూకలు 25 శాతం ఉండేవి. ఇప్పుడు నూకల శాతాన్ని 15 శాతానికి తగ్గించాం. ఏప్రిల్ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలోనూ ఇదే రకమైన నాణ్యతతో కూడిన బియ్యాన్ని అందిస్తాం' అని జగన్ చెప్పారు. కాగా, అంతకు ముందు టీడీపీ ఎమ్మెల్యే రామానాయుడు మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తోన్న బియ్యంపై విమర్శలు గుప్పించారు. అలాగే, విపక్షనేతలకు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని అన్నారు.