Disha: అందుకే వారిపై కాల్పులు జరపాల్సి వచ్చింది: ఎన్హెచ్ఆర్సీతో ఎన్ కౌంటర్ లో పాల్గొన్న పోలీసులు
- ఎన్హెచ్ఆర్సీ బృందం విచారణ
- నిందితులు అకస్మాత్తుగా కర్రలతో, రాళ్లతో దాడి చేశారు
- అనంతరం తుపాకులు లాక్కున్నారన్న పోలీసులు
- ఆత్మరక్షణ కోసం కాల్పులు జరిపామని వివరణ
'దిశ' హత్యాచార నిందితులను పోలీసులు ఎన్ కౌంటర్ లో కాల్చి చంపిన విషయంపై జాతీయ మానవహక్కుల కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ) బృందం విచారణ చేపట్టింది. ఈ ఎన్కౌంటర్ సమయంలో గాయపడి కొందరు పోలీసులు ఆసుపత్రిలో చికిత్స పొందుతోన్న విషయం తెలిసిందే. పోలీసులకు తగిలిన గాయాలపై ఆ బృందం.. వైద్యులను అడిగి వివరాలు తెలుసుకుంది. అలాగే, ఎన్కౌంటర్లో పాల్గొన్న పోలీసులను విచారించింది.
నిందితులు తమపై దాడిచేసిన తీరును పోలీసులు వివరించారు. వారు అకస్మాత్తుగా కర్రలతో, రాళ్లతో తమపై దాడిచేసి తుపాకులు లాక్కున్నారని పోలీసులు చెప్పారు. అనంతరం నిందితులు కాల్పులకు తెగబడ్డారని, ఈ పరిస్థితుల్లోనే ఆత్మరక్షణ కోసం తాము కాల్పులు జరిపామని పోలీసులు తెలిపారు. నిందితుల పోస్ట్మార్టం రిపోర్టులు, సీసీ ఫుటేజీలను ఎన్హెచ్ఆర్సీకి పోలీసులు అందించారు.