central Minister: పోలవరం నిధులు విడుదల చేయాలని కేంద్ర మంత్రిని కోరాం: ఏపీ మంత్రి అనిల్
- కేంద్ర జల్ శక్తి మంత్రిని కలిసిన మంత్రి, వైసీపీ ఎంపీలు
- ప్రాజెక్టు పనులు త్వరగా పూర్తయ్యేలా చూడాలని కోరాం
- అందుకు మంత్రి సానుకూలంగా స్పందించారు
కేంద్ర జల్ శక్తి మంత్రి షెకావత్ ను ఏపీ మంత్రి అనిల్ కుమార్, వైసీపీ ఎంపీలు కలిశారు. ఢిల్లీలో షెకావత్ ను కలిసిన అనంతరం అనిల్ మీడియాతో మాట్లాడుతూ, పోలవరం నిధులను త్వరగా విడుదల చేయాలని, ఈ ప్రాజెక్టు పనులు త్వరగా పూర్తయ్యేలా చూడాలని షెకావత్ ను కోరగా ఆయన సానుకూలంగా స్పందించినట్టు చెప్పారు. ఆర్ అండ్ ఆర్ నిధులు కూడా విడుదల చేయాలని కోరినట్టు తెలిపారు.
పోలవరం రివర్స్ టెండరింగ్ పై మంత్రి సంతృప్తి చెందారని చెప్పారు. రివర్స్ టెండరింగ్ ద్వారా రూ.800 కోట్లు ఆదా చేసిన విషయాన్ని, ఇప్పటివరకు 35 శాతం మాత్రమే పోలవరం పనులు పూర్తయిన విషయాన్ని ఆయన దృష్టికి తెచ్చామని అన్నారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల తర్వాత పోలవరం సందర్శనకు షెకావత్ వస్తానని చెప్పినట్టు పేర్కొన్నారు. 2021 నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని అన్నారు.