Telangana: విద్యార్థులూ, ఇక పరీక్షలకు సన్నద్ధం కండి!: తెలంగాణ ఇంటర్ బోర్డు కార్యదర్శి
- గత ఏడాది సాఫ్ట్ వేర్ చెక్ చేయకపోవడం వల్లే సమస్య తలెత్తింది
- సీజీజీ కొత్త సాఫ్ట్ వేర్ రూపొందించింది
- టెస్టింగ్ విజయవంతంగా పూర్తయింది.. సమస్యలు రాలేదు
ఇంటర్ పరీక్షలను ఈసారి పకడ్బందీగా నిర్వహించనున్నామని తెలంగాణ ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఒమర్ జలీల్ అన్నారు. ఈ రోజు ఆయన బోర్డు కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. గత ఏడాది ఇంటర్ పరీక్షల్లో చాలా ఇబ్బందులు ఎదురయ్యాయన్నారు. వాటిని పరిశీలించామని.. ఈ సారి అన్ని జాగ్రత్తలతో పరీక్షలు నిర్వహించనున్నామని చెప్పారు. సాఫ్ట్ వేర్ టెస్ట్ చేయకపోవడం వల్లే సమస్యలు తలెత్తాయన్నారు. త్రిసభ్య కమిటీ సిఫార్సు ప్రకారం కొత్త సాఫ్ట్ వేర్ ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
సీజీజీ కొత్త సాఫ్ట్ వేర్ రూపొందించిందన్నారు. అంతేకాక, బోర్డులో ఐటీ విభాగం కూడా ఏర్పాటు చేశామని వెల్లడించారు. ఈ సాఫ్ట్ వేర్ టెస్టింగ్ కూడా పూర్తయిందన్నారు. ఇప్పటివరకు ఎలాంటి సాంకేతిక సమస్య రాలేదన్నారు. గ్లోబరీనాపై ప్రస్తుతం ఏమీ మాట్లాడనని ఆయన అన్నారు. విద్యార్థులు అనుమానాలు లేకుండా పరీక్షలకు సిద్ధం కావాలని సూచించారు. డేటాలో పొరపాట్లు కనిపిస్తే.. తమ ప్రిన్సిపాల్ దృష్టికి తేవాలని తెలిపారు.