Disha: దిశ నిందితుల ఎన్ కౌంటర్ కేసు: ముగిసిన జాతీయ మానవ హక్కుల కమిషన్ పర్యటన
- నాలుగు రోజుల పాటు హైదరాబాద్ లో పర్యటన
- ఎన్ కౌంటర్ పై వివరాల సేకరణ
- నివేదిక అందించిన పోలీసులు
వెటర్నరీ వైద్యురాలు దిశపై కొందరు మృగాళ్లు హత్యాచారానికి పాల్పడ్డ నేపథ్యంలో వారిని పోలీసులు ఎన్ కౌంటర్ లో హతమార్చిన ఘటనపై విచారణ జరిపేందుకు జాతీయ మానవ హక్కుల సంఘం బృందం హైదరాబాద్ కు వచ్చిన విషయం తెలిసిందే. ఆ కమిషన్ సభ్యుల పర్యటన ముగిసింది.
నాలుగు రోజుల పాటు ఎన్ కౌంటర్ పై వివరాలు సేకరించారు. దిశ నిందితుల ఎన్ కౌంటర్ పై నిజనిర్ధారణ కోసం వారు ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు వచ్చారు. వారికి పోలీసులు ఇప్పటికే నివేదిక అందించారు. నలుగురు నిందితులను పోలీసులు ఎన్ కౌంటర్ చేసిన ప్రదేశాన్ని, ఆ మృతదేహాలను కమిషన్ సభ్యులు పరిశీలించారు.
దిశ అపహరణ, అత్యాచారం, మృతదేహం కాల్చివేత వంటి అన్ని వివరాలను నివేదికలో పేర్కొన్నారు. ఎన్ కౌంటర్ కు సంబంధించి కీలకమైన ఆధారాలను అందజేశారు. నిందితులను పోలీసులు ఎన్ కౌంటర్ లో కాల్చిచంపిన విషయం తెలిసిందే. వారు పారిపోయేందుకు ప్రయత్నించడంతోనే తాము కాల్పులు జరిపామని వారు అంటున్నారు. దిశ కేసులో నిందితుల ఎన్ కౌంటర్పై మీడియాలో వచ్చిన కథనాల ఆధారంగా జాతీయ మానవహక్కుల కమిషన్ ఈ కేసును సుమోటోగా నమోదు చేసి విచారణ కొనసాగిస్తోంది.