repalli MLA satyaprasad: ఆర్థిక ఇబ్బందులున్నప్పుడు అంతమంది సలహాదారులు అవసరమా?: ప్రభుత్వానికి టీడీపీ సూటి ప్రశ్న
- అసెంబ్లీలో నిలదీసిన ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్
- మీరు రూపాయి జీతం తీసుకుని మీ వాళ్లకు లక్షలు ఇస్తున్నారు
- నియామకాల్లో కనీసం సామాజిక న్యాయం పాటించలేదని ఆరోపణ
ఓ వైపు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయంటూ వాపోతున్న జగన్‌మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలోని ప్రభుత్వం మరోవైపు ఇష్టానుసారం సలహాదారులను నియమించుకుని లక్షలు ఖర్చు చేస్తోందని టీడీపీ ధ్వజమెత్తింది. అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో గుంటూరు జిల్లా రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ మాట్లాడుతూ రూపాయి జీతం తీసుకుంటున్నానని చెప్పే ముఖ్యమంత్రిగారు ఇందుకోసం లక్షలు ఖర్చు చేయడం ఎందుకో చెప్పాలని పట్టుబట్టారు. భారీ సంఖ్యలో సలహాదారులను నియమించారని, నియామకాల్లో కనీసం సామాజిక న్యాయం కూడా పాటించలేదని ధ్వజమెత్తారు. సొంత సామాజికవర్గానికి సలహాదారులు, కీలక పదవుల్లో పెద్ద పీట వేశారని విమర్శించారు. నియమించిన వారిలో ఎంతమంది బీసీలు, ఇతర వర్గాల వారు ఉన్నారో చెప్పాలని నిలదీశారు. అన్ని పదవులు ఒకే వర్గానికి ఇవ్వడంలోని ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు.