Jagan: ఈ ప్రసంగాన్ని చంద్రబాబు టీవీలో చూసి నాలెడ్జ్ పెంచుకుంటారని ఆశిస్తున్నా: సీఎం జగన్
- గ్రామ సచివాలయ వ్యవస్థ అంశంపై అసెంబ్లీలో చర్చ
- ఈ చర్చలో చంద్రబాబు పాల్గొంటారని ఎదురు చూశా
- బాబు తన ధోరణి మారదు అన్నట్టుగా బిహేవ్ చేశారు
గ్రామ సచివాలయ వ్యవస్థ అంశంపై ఈరోజు అసెంబ్లీలో చర్చ జరిగింది. దీనిపై చర్చ ముగింపు సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ, ముఖ్యమైన అంశంపై చర్చలో ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు పాల్గొంటారని ఎదురు చూశామని, చాలా సమయం వేచి చూశామని, ఆయన మాత్రం తన ధోరణి మారదు అన్నట్టుగా బిహేవ్ చేస్తూ ఈ చర్చకు రాలేదని అన్నారు.
ఈ చర్చలో చంద్రబాబు పాల్గొంటే బాగుండేదని, టీడీపీ హయాంలో ప్రవేశపెట్టిన జన్మభూమి కమిటీలు ఏ రకంగా విఫలమయ్యాయో, గ్రామ సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థ ఏ రకంగా సక్సెస్ అవుతుందో బాబుకు అర్థమయ్యే విధంగా, ఆయనకు నాలెడ్జ్ పెంచే విధంగా ఈ చర్చ ఉండేదని అన్నారు. దురదృష్టవశాత్తు, చంద్రబాబు రాలేదని, రాలేకపోయినప్పటికీ ఈ ప్రసంగాన్ని ఆయన టీవీలో చూస్తూ వుంటారని అనుకుంటున్నానని, ‘నాలెడ్జ్ కాస్త పెంచుకుంటాడని ఆశిస్తున్నా’ అంటూ జగన్ చేసిన వ్యాఖ్యలకు వైసీపీ సభ్యులు నవ్వులు చిందించారు.
తాము అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోపే అక్షరాల నాలుగు లక్షల ఉద్యోగాలు కల్పించామని, ఇటువంటి ఘటన ఏపీలో మాత్రమే జరిగిందని, ఇది విప్లవాత్మకమైన నిర్ణయమని జగన్ అన్నారు. గ్రామ సచివాలయాల ద్వారా దాదాపు ఐదు వందల రకాల సేవలు అందిస్తామని, ఏఏ సేవలు ఎన్ని రోజుల్లో చేస్తామన్న వివరాలను డిస్ ప్లే చేయమని అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్టు చెప్పారు.