Disa: దిశ ఘటనలు ఏపీలో జరగకూడదనే ఈ యాక్టు తీసుకొచ్చాం: హోం మంత్రి సుచరిత
- ఈ యాక్టు ప్రకారం 21 రోజుల్లో విచారణ పూర్తవుతుంది
- ఆపై శిక్ష పడుతుంది
- మహిళలపై లైంగికదాడులకు పలు కారణాలు ఉన్నాయి
దిశ ఘటనలు ఆంధ్రప్రదేశ్ లో జరగకూడదన్న ఉద్దేశంలో దిశ ఏపీ 2019 యాక్టు తీసుకువచ్చామని హోం శాఖ మంత్రి సుచరిత చెప్పారు. ఏపీ కేబినెట్ సమావేశం ముగిసిన అనంతరం, మీడియాతో ఆమె మాట్లాడుతూ, ఈ యాక్టు ప్రకారం అఘాయిత్యాలు, అత్యాచారాలకు పాల్పడే వారిని వెంటనే అరెస్టు చేసి.. 21 రోజుల్లో విచారణ పూర్తి చేసి శిక్ష విధిస్తారని అన్నారు.
వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మహిళల రక్షణ నిమిత్తం సైబర్ మిత్ర, మహిళా మిత్ర కార్యక్రమాలను తీసుకొచ్చినట్టు చెప్పారు. అత్యాచారాలు రోజురోజుకీ పెరుగుతున్నాయని, అందుకు పలు రకాల అంశాలు దోహదపడుతున్నట్టు మంత్రి చెప్పారు. మద్యపానం, మాదకద్రవ్యాలు, పోర్న్ సైట్స్ ప్రభావాలతో మహిళలపై లైంగికదాడులు పెరుగుతున్నాయని, నేరాల సంఖ్య క్రమంగా పెరుగుతోందని అన్నారు. ఇటువంటి పరిస్థితుల్లోనే తమ ప్రభుత్వం ఈ యాక్టు తీసుకువచ్చిందని సుచరిత చెప్పారు.