Mumbai: వాంఖెడేలో పోటాపోటీగా సిక్సర్లు బాదిన టీమిండియా బ్యాట్స్ మెన్.. స్కోరు 240/3
- రెచ్చిపోయిన భారత టాపార్డర్
- ఫిఫ్టీలు సాధించిన రోహిత్, రాహుల్, కోహ్లీ
- 16 సిక్సర్లు నమోదు
వెస్టిండీస్ తో చివరి టీ20 మ్యాచ్ లో టీమిండియా కళ్లుచెదిరే భారీ స్కోరు సాధించింది. ముంబయి వాంఖెడే మైదానంలో టాపార్డర్ బ్యాట్స్ మెన్ సిక్సర్ల వర్షం కురిపించడంతో భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 240 పరుగులు చేసింది. రోహిత్ శర్మ (34 బంతుల్లో 71), కేఎల్ రాహుల్ (91 నాటౌట్), కెప్టెన్ విరాట్ కోహ్లీ పోటాపోటీగా సిక్సర్లు బాదారు. టీమిండియా ఇన్నింగ్స్ లో మొత్తం 16 సిక్సర్లు ఉండగా, వాటిలో కోహ్లీ కొట్టినవే 7 సిక్సులున్నాయి. రోహిత్ 5 సిక్స్ లు, రాహుల్ 4 సిక్స్ లు సంధించారు.
ఈ మ్యాచ్ లో కోహ్లీ ఆటతీరే హైలైట్. అత్యధిక ఓవర్లు ముగిసిన తర్వాత బరిలో దిగినా విపరీతమైన దూకుడుతో కేవలం 29 బంతుల్లోనే 70 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. రాహుల్ సైతం విధ్వంసక ఇన్నింగ్స్ ఆడాడు. రాహుల్ 56 బంతుల్లో 91 పరుగులు చేశాడు.