Jagan: ఆడపిల్లల తండ్రిగా ఆలోచించి కొత్త చట్టం తెచ్చారు: సీఎంపై రోజా ప్రశంసలు
- మహిళల రక్షణ కోసం ఏపీ కొత్త చట్టం
- మీడియాతో మాట్లాడిన రోజా
- జగన్ మానవీయ కోణంలో ఆలోచించారన్న రోజా
ఏపీలో దిశ పేరుతో కొత్త చట్టం తీసుకువచ్చేందుకు రంగం సిద్ధమైంది. ఈ మేరకు క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. దీనిపై వైసీపీ ఎమ్మెల్యే రోజా మాట్లాడుతూ, సీఎం జగన్ ఆడపిల్లల తండ్రిగా ఆలోచించి ఈ చట్టం తీసుకువచ్చారని తెలిపారు. జగన్ మానవీయ కోణంలో ఆలోచించారని వివరించారు. నిర్భయ ఘటన తర్వాత నిర్భయ చట్టం వచ్చిందని, కానీ ఆ చట్టం వచ్చిన తర్వాత కూడా ఘటనలు జరిగాయని వెల్లడించారు.
దర్యాప్తులో ఆలస్యం జరగడం, కోర్టు విచారణ ఎక్కువ కాలం కొనసాగడం వల్ల నేరస్తుల్లో భయం లేకుండాపోయిందని అన్నారు. ఏ నిర్భయ పేరు మీద చట్టం తీసుకువచ్చారో, ఆ నిర్భయ కేసులోనే ఇంతవరకు శిక్ష అమలు జరగలేదని రోజా పేర్కొన్నారు. ఉన్నావోలో బాధితురాలు పోరాడినందువల్ల ఆమె కుటుంబ సభ్యులను చంపేశారని, మరో ఘటనలో బాధితురాలిని సైతం సజీవదహనం చేశారని, న్యాయప్రక్రియ ఇంత సుదీర్ఘంగా జరగడం వల్ల ఇన్ని అనర్థాలు జరిగే అవకాశం ఉందని సీఎం జగన్ భావించారని రోజా వివరించారు.
దిశ ఘటనతో సీఎం ఇద్దరు ఆడపిల్లల తండ్రిగా ఎంతో వ్యాకులతకు లోనయ్యారని, అందరి ఆలోచనలను పరిగణనలోకి తీసుకుని కొత్తం చట్టం రూపొందించాలన్న నిర్ణయం తీసుకున్నారని వెల్లడించారు. 21 రోజుల్లో విచారణ పూర్తయి మరణశిక్ష పడుతుందంటే తప్పకుండా భయపడతారని తెలిపారు. మహిళల రక్షణకు ఈ కొత్త చట్టం ఆయుధమని అభివర్ణించారు.