Hyderabad: టీచర్ల ఆగ్రహం...పదో తరగతి విద్యార్థికి తీవ్రగాయాలు!
- ఓ ప్రైవేటు పాఠశాల ఉపాధ్యాయుల నిర్వాకం
- పాఠశాలకు బూట్లు వేసుకు రావడం లేదని...
- ఇంటికి ఆలస్యంగా వెళ్తున్నాడని ఇష్టానుసారం కొట్టిన వైనం
పాఠశాలకు బూట్లు వేసుకురావడం లేదని, స్కూలు విడిచి పెట్టాక ఆలస్యంగా ఇంటికి వెళ్తున్నాడన్న ఆగ్రహంతో ఓ పదో తరగతి విద్యార్థిని పాఠశాల ఉపాధ్యాయులు ఇద్దరు చితకబాదారు. చిన్నతప్పుకు పెద్ద శిక్ష వేయడంతో వివాదాస్పదమైంది. టీచర్ల తీరుపై బాధిత తండ్రి ఆగ్రహం వ్యక్తం చేస్తూ అధికారులకు ఫిర్యాదు చేశారు.
వివరాల్లోకి వెళితే...సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పట్టణంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో రామచంద్రపురానికి చెందిన అబ్దుల్ రజాక్ పదో తరగతి చదువుతున్నాడు. బూట్లు వేసుకోవడం లేదని, ఇంటికి ఆలస్యంగా వెళ్తున్నాడని ఆగ్రహించిన తెలుగు, ఇంగ్లీష్ టీచర్లు రజాకను చితకబాదారు.
దీంతో అతని చెయ్యి, వీపు, దవడపై తీవ్రగాయాలయ్యాయి. ఇదేం తీరని బాధిత విద్యార్థి తండ్రి రఫీ పాఠశాల నిర్వాహకులను ప్రశ్నిస్తే వారి నుంచి సరైన సమాధానం రాలేదు. దీంతో ఆగ్రహించిన అతను విద్యాశాఖాధికారులకు ఫిర్యాదు చేశారు.
మండల విద్యాశాఖాధికారి రాథోడ్ నిన్న పాఠశాలలో విచారణ నిర్వహించారు. విద్యార్థులను కొట్టడం తీవ్ర నేరమని బాధ్యులైన ఉపాధ్యాయులను మందలించారు. ఈ వివాదంపై ఉన్నతాధికారులకు నివేదిక ఇస్తానని, వారి ఆదేశాల మేరకు తదుపరి చర్యలు తీసుకుంటానని రాథోడ్ తెలిపారు.