Chandrababu: చంద్రబాబు వ్యాఖ్యల అంశాన్ని ఎథిక్స్ కమిటీకి ఇవ్వాలన్న ఆనం... స్పందించిన స్పీకర్
- జగన్ ను ఉన్మాది అన్న చంద్రబాబు
- క్షమాపణ చెప్పాలని వైసీపీ డిమాండ్
- క్షమాపణ చెప్పకపోతే ఎథిక్స్ కమిటీకి రిఫర్ చేస్తానన్న స్పీకర్
ముఖ్యమంత్రి జగన్ ను ఉద్దేశించి 'ఉన్మాది' అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు శాసనసభలో దుమారం రేపాయి. ఈ వ్యాఖ్యలపై చంద్రబాబు క్షమాపణ చెప్పాలని వైసీపీ సభ్యులు డిమాండ్ చేయగా... క్షమాపణలు చెప్పే ప్రసక్తే లేదని చంద్రబాబు అన్నారు. మానవత్వం లేని వ్యక్తి క్షమాపణలు చెబుతారని తాను కూడా భావించడం లేదని జగన్ వ్యాఖ్యానించారు.
ఈ సందర్భంగా వైసీపీ ఎమ్మెల్యే ఆనం రాంనారాయణ రెడ్డి మాట్లాడుతూ, చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరమని చెప్పారు. సభ సంప్రదాయాల ప్రకారం చంద్రబాబు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. మనుషులన్నాక తప్పులు చేయడం సహజమేనని... ఈ విషయాన్ని చంద్రబాబు ఒప్పుకుని క్షమాపణ చెప్పాలని లేదా తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని అన్నారు. లేని పక్షంలో చంద్రబాబు వ్యాఖ్యల అంశాన్ని ఎథిక్స్ కమిటీకి నివేదించాలని స్పీకర్ తమ్మినేని సీతారాంను కోరారు.
ఈ నేపథ్యంలో స్పీకర్ స్పందిస్తూ... క్షమాపణ చెప్పాలా? వద్దా? అనే విషయాన్ని చంద్రబాబు విజ్ఞతకే వదిలేస్తున్నానని చెప్పారు. క్షమాపణ చెప్పకపోతే ఎథిక్స్ కమిటీకి రిఫర్ చేస్తానని తెలిపారు.