pankaja munde: పార్టీ వీడడంపై స్పష్టతనిచ్చిన బీజేపీ నేత పంకజ ముండే
- పార్టీని వీడబోవడం లేదు
- పార్టీ రాష్ట్ర కోర్‌కమిటీలో మాత్రం ఉండను
- 27న ఔరంగాబాద్‌లో ఒక రోజు నిరాహార దీక్ష
పార్టీని వీడబోతున్నారంటూ గత కొంతకాలంగా వస్తున్న వార్తలపై మహారాష్ట్ర బీజేపీ నేత, కేంద్ర మాజీ మంత్రి పంకజ ముండే స్పష్టతనిచ్చారు. ఆ వార్తల్లో నిజం లేదని, తాను పార్టీ మారబోవడం లేదని వివరణ ఇచ్చారు. అయితే, పార్టీ రాష్ట్ర కోర్‌కమిటీలో మాత్రం కొనసాగబోనని తేల్చి చెప్పారు. పంకజ తండ్రి, కేంద్రమాజీ మంత్రి అయిన గోపీనాథ్ ముండే జయంతి సందర్భంగా బీద్ జిల్లాలో గురువారం నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.
పంకజ ముండే ఇటీవల మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికల్లో తన ఓటమి వెనక బీజేపీ నేతల హస్తం ఉందని, ఆ స్థానం నుంచి తాను గెలవడం కొందరికి ఇష్టం లేదంటూ మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌పై పరోక్ష ఆరోపణలు చేశారు. దీంతో ఆమె పార్టీని వీడబోతున్నారన్న ప్రచారం జోరందుకుంది. ఈ నేపథ్యంలో ఆమె స్పందిస్తూ పార్టీ మారే ఉద్దేశం లేదన్నారు. కాగా, మరాఠ్వాడా ప్రాంత సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు జనవరి 27న ఔరంగాబాద్‌లో ఒక రోజు నిరాహార దీక్ష చేపట్టనున్నట్టు పంకజ ముండే తెలిపారు.