dilip ghosh: పౌరసత్వ సవరణ చట్టాన్ని పశ్చిమ బెంగాల్ లో అడ్డుకోవడం ఎవరితరమూ కాదు: బీజేపీ రాష్ట్ర చీఫ్ దిలీప్ ఘోష్
- మమతా బెనర్జీపై పశ్చిమ బెంగాల్ బీజేపీ అధ్యక్షుడి విమర్శలు
- ఆర్టికల్ 370 రద్దు, పెద్ద నోట్ల రద్దును కూడా వ్యతిరేకించారు
- వాటి అమలును మమతా బెనర్జీ ఆపలేకపోయారు
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇంతకు ముందు ఆర్టికల్ 370 రద్దు, పెద్ద నోట్ల రద్దును కూడా వ్యతిరేకించారని, ఇప్పుడు పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నారని పశ్చిమ బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు దిలీప్ ఘోష్ విమర్శించారు. గతంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను అమలు చేయడాన్ని మమతా బెనర్జీ ఆపలేకపోయారని, ఇప్పుడు కూడా పౌరసత్వ చట్టం అమలును అడ్డుకోలేరని అన్నారు. పశ్చిమ బెంగాల్ లోనే మొదట పౌరసత్వ సవరణ చట్టం అమలు జరుగుతుందని చెప్పారు.
మమతా బెనర్జీకి అక్రమవలసదారుల పట్ల ప్రేమ ఎందుకు ఉందో, అలాగే హిందూ శరణార్థుల పట్ల ప్రేమ ఎందుకు లేదో అర్థం కావడం లేదని దిలీప్ ఘోష్ విమర్శలు గుప్పించారు. అక్రమ వలసదారుల గురించే ఆమె బాధ పడుతున్నారని ఎద్దేవా చేశారు. పౌరసత్వ సవరణ చట్టాన్ని తమ రాష్ట్రంలో అమలు చేయకుండా అడ్డుకోవడం ఎవరితరమూ కాదని చెప్పుకొచ్చారు.