UK General Elections: బ్రిటన్ ఎన్నికల విజేతల్లో భారత సంతతికి చెందినవారి హవా!
- సుమారు 12 మంది గెలుపు
- కొత్తగా ఎన్నికైన ముగ్గురు ఎంపీలు
- తమ స్థానాలను కాపాడుకున్న సిట్టింగ్ ఎంపీలు
ఇటీవల యూకేలో జరిగిన సాధారణ ఎన్నికల్లో భారత సంతతికి చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యేలు తమ స్థానాలను నిలబెట్టుకోగా కొత్తగా మరో ముగ్గురు పార్లమెంట్ లోకి అడుగుపెట్టనున్నారు. భారత ఐటీ పారిశ్రామిక వేత్త, ఇన్ఫోసిస్ సహవ్యవస్థాపకుడు నారాయణమూర్తి అల్లుడు రిషి సునాక్, ప్రీతి పటేల్, అలోక్ శర్మలు సునాయాసంగా గెలిచి తమ స్థానాలను నిలబెట్టుకున్నారు. గగన్ మహీంద్రా, క్లేరీ కోటిన్హో, నవేంద్రు మిశ్రా( లేబర్ పార్టీ) తొలిసారిగా పోటీచేసి విజయం సాధించి పార్లమెంట్ లోకి ప్రవేశించనున్నారు.
ఈ ఎన్నికల్లో అధికార కన్జర్వేటివ్ పార్టీ విజయ బావుటా ఎగురవేసిన విషయం తెలిసిందే. గత లోక్ సభలో అధికారంలో ఉన్న కన్జర్వేటివ్ పార్టీ, ప్రతిపక్ష లేబర్ పార్టీ తరపున పోటీచేసిన భారత సంతతికి చెందిన ఎంపీలందరూ తిరిగి విజయం సాధించారు. గగన్ మహీంద్ర, గోవా మూలాల సంతతికి చెందిన క్లేరీ కోటిన్హో కన్జర్వేటివ్ పార్టీ తరఫున పోటీ చేసి విజయం సాధించగా, నవేంద్రు మిశ్రా, ప్రీత్ కౌర్ గిల్, వీరేంద్ర శర్మలు లేబర్ పార్టీ తరఫున, మునిరా విల్సన్ లిబరల్ డెమోక్రాట్స్ తరపున బరిలోకి దిగి గెలుపును అందుకున్నారు. ఎన్నికల్లో గెలిచిన ఇతరుల్లో లీసా నాండి, సీమా మల్హోత్రా, తన్ మన్జీత్ దేశీ, శైలేష్ వారా, స్యూల్లా బ్రావెర్మర్ తదితరులున్నారు.