Assam: ఈశాన్య రాష్ట్రాల్లో ఆగని నిరసన జ్వాలలు... సోషల్ మీడియా యూజర్లకు సైన్యం సలహా
- పౌరసత్వ చట్ట సవరణ బిల్లు తీసుకువచ్చిన కేంద్రం
- మండిపడుతున్న ఈశాన్య రాష్ట్రాలు
- అసోంలో హింసాత్మక ఘటనలు
కేంద్రం తీసుకువచ్చిన పౌరసత్వ చట్ట సవరణ బిల్లు ఈశాన్య రాష్ట్రాల్లో అగ్గి రాజేసింది. కొత్త పౌరసత్వ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ప్రజలు ఆగ్రహావేశాలు ప్రదర్శిస్తుండడంతో అసోం తదితర రాష్ట్రాల్లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో, సోషల్ మీడియా వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని భారత సైన్యం పేర్కొంది. ఫేక్ న్యూస్ తో రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తారని, తప్పుడు వార్తలను నమ్మొద్దని స్పష్టం చేసింది. నిరసనలు, ఇతర కార్యక్రమాల గురించి సోషల్ మీడియాలో నకిలీ వార్తలు వ్యాప్తి చెందుతున్నాయని, ఇలాంటి దుష్ప్రచారం చేస్తున్న వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని కోరింది. ప్రస్తుతం అసోంలోని వివిధ ప్రాంతాలు సమస్యాత్మకంగా మారడంతో భారీగా భద్రతా బలగాలను మోహరించారు.