Pawan Kalyan: నా భవిష్యత్తు కోసం కూడా నేను ఆలోచించాలి: జనసేన ఎమ్మెల్యే రాపాక
- జనసేనలో కొన్ని మార్పులు జరగాల్సిన అవసరం ఉంది
- సరైన నిర్ణయాలు తీసుకోకపోతే పార్టీ ముందుకు సాగదు
- జనసేన నుంచి నాకు షోకోజ్ నోటీసు రాలేదు
ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం విద్యను మాత్రమే బోధించడం సరికాదని... తెలుగు మీడియంలో చదువుకోవాలనుకునే వారికి కూడా వెసులుబాటు ఉండాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ పదేపదే చెబుతున్న సంగతి తెలిసిందే. ఈ అంశంపై వైసీపీ ప్రభుత్వ తీరును ఆయన ఎండగడుతున్నారు. ఈ నేపథ్యంలో, జనసేన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ మాట్లాడుతూ, వైసీపీ ప్రభుత్వంపై ప్రశంసలు గుప్పించారు. ప్రభుత్వ చర్యలను అభినందిస్తున్నానని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో, తమ పార్టీ అధినేత అభిప్రాయాలకు భిన్నంగా రాపాక మాట్లాడటం చర్చనీయాంశంగా మారింది.
ఇదే అంశంపై మీడియాతో రాపాక మాట్లాడుతూ, జనసేనలో కొన్ని మార్పులు జరగాల్సిన అవసరం ఉందని చెప్పారు. కొన్ని సరైన నిర్ణయాలను తీసుకోకపోతే పార్టీ ముందుకు సాగదని అన్నారు. తన భవిష్యత్తు గురించి కూడా తాను ఆలోచించాలని సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే, తనకు ఇంతవరకు జనసేన నుంచి షోకాజ్ నోటీసులు రాలేదని చెప్పారు. వైసీపీతో తనకు సంబంధాలు ఉన్నాయనే ఆరోపణల్లో వాస్తవం లేదని తెలిపారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే... అసెంబ్లీలో మైక్ దొరకదని అన్నారు.