BJP: బీజేపీ కూటమిలోనే 'క్యాబ్' సెగలు - బిల్లును వ్యతిరేకిస్తున్న అసోం గణపరిషత్
- యూటర్న్ తీసుకున్న పార్టీ
- తొలుత పార్లమెంటులో మద్దతు
- తాజాగా వ్యతిరేకిస్తూ మోదీ, అమిత్ షాలను కలవాలని నిర్ణయం
పౌరసత్వ సవరణ బిల్లు విషయంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి తాజాగా గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటికే 'క్యాబ్' బిల్లును వ్యతిరేకిస్తూ ఈశాన్య రాష్ట్రాల్లో పరిస్థితులు అట్టుడుకుతుంటే ప్రజా స్పందనతో గతుక్కుమన్న ఎన్డీయే కీలక భాగస్వామ్య పక్షం అసోం గణపరిషత్ యూటర్న్ తీసుకుంది. తొలుత పార్లమెంటులో మద్దతు పలికిన పార్టీ తాజా పరిస్థితుల నేపథ్యంలో బిల్లును వ్యతిరేకిస్తున్నట్లు ప్రకటించింది. బిల్లుకు వ్యతిరేకంగా సుప్రీం కోర్టును ఆశ్రయించనున్నట్లు నిన్న జరిగిన పార్టీ సీనియర్ నాయకుల సమావేశంలో నిర్ణయించారు.
తమ నిర్ణయాన్ని తెలియజేసేందుకు బీజేపీ నేతలు మోదీ, అమిత్ షాలను కూడా కలవాలని భావిస్తున్నారు. తొలుత బిల్లుకు మద్దతు ఇచ్చినా, ప్రజాగ్రహం నేపథ్యంలో పార్టీ నేతలు పలువురు రాజీనామా చేయడంతో అధిష్టానం కూడా ఆలోచనలో పడినట్లు తెలుస్తోంది.
అసోంకు చెందిన పలువురు బీజేపీ నేతలు కూడా క్యాబ్ కు వ్యతిరేకంగా ఉన్నారు. ఆ పార్టీ నాయకుడు జతిన్బోరా ఇప్పటికే తన పదవికి రాజీనామా చేశారు.