Andhra Pradesh: చేసిన తప్పులపై క్షమాపణలు చెప్పిన తర్వాతే టీడీపీ వాళ్లు సభలో అడుగుపెట్టాలి: శ్రీకాంత్ రెడ్డి

  • తాడేపల్లిలో మీడియాతో మాట్లాడిన శ్రీకాంత్ రెడ్డి
  • సభలో చంద్రబాబు తీరు దారుణమంటూ వ్యాఖ్యలు
  • సమస్యలపై చర్చించే ధైర్యం టీడీపీకి లేదని విమర్శలు

టీడీపీ అధినేత చంద్రబాబుపైనా, ఆ పార్టీ నేతలపైనా చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీలో చంద్రబాబు తీరు దారుణమని, సభను తప్పుదోవ పట్టించేలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ, ప్రజాసమస్యలపై చర్చించే ధైర్యం టీడీపీకి లేదని, ఏ అంశంపై చర్చించేందుకు కూడా టీడీపీ సిద్ధంగా లేదని విమర్శించారు. సభలో ప్రాజెక్టులపై మాట్లాడదామంటే చంద్రబాబు చేతులెత్తేశారని విమర్శించారు. ఉల్లిధరలపై రాద్ధాంతం చేస్తున్నారని, మహిళా భద్రత బిల్లు సహా అనేక బిల్లులపై, ప్రజాసమస్యలపై చర్చించేందుకు టీడీపీకి ఎందుకంత భయం? అని ప్రశ్నించారు.

సభలో గొడవలు చేసేందుకే టీడీపీ అధిక సమయం వెచ్చిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేసిన శ్రీకాంత్ రెడ్డి, మార్షల్స్ తో చంద్రబాబు ప్రవర్తించిన తీరు వీడియోలో స్పష్టంగా ఉందని వెల్లడించారు. మార్షల్స్ తో దురుసుగా ప్రవర్తించడమే కాకుండా ఎదురుదాడి చేస్తున్నారంటూ మండిపడ్డారు. చేసిన తప్పులపై క్షమాపణ చెప్పిన తర్వాతే టీడీపీ సభ్యులు సభలో అడుగుపెట్టాలని స్పష్టం చేశారు. వచ్చే రెండ్రోజులైనా సభ సజావుగా జరిగేందుకు టీడీపీ సభ్యులు సహకరించాలని శ్రీకాంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.

  • Loading...

More Telugu News