vijayasai reddy: ‘కాపుల ఆత్మీయ కలయిక’లో విజయసాయిరెడ్డికి ఊహించని అనుభవం.. అవంతి ఆగ్రహం!
- విజయసాయిని చూడగానే ‘జై కాపు, జైజై కాపు’ అని నినాదాలు
- కాపుల సభకు ఇతర నేతలు ఎలా వస్తారని ప్రశ్న
- తాను మంత్రిని కాబట్టే సహనంగా ఉన్నానన్న అవంతి
విశాఖపట్టణం జిల్లాలోని కంబాలకొండలో నిన్న నిర్వహించిన ‘కాపుల ఆత్మీయ కలయిక’ సభలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి ఊహించని అనుభవం ఎదురైంది. కార్యక్రమానికి వచ్చిన ఆయనను చూడగానే కొందరు ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ‘జై కాపు.. జైజై కాపు’ అని నినదించారు. కాపుల సమావేశానికి వైసీపీ నేతలందరూ ఎలా వస్తారని కార్యక్రమానికి వచ్చిన ఇతర నేతలను ఉద్దేశించి ప్రశ్నించారు. దీంతో కార్యక్రమంలో కొంతసేపు అలజడి నెలకొంది.
దీంతో విజయసాయి మాట్లాడుతూ.. తానూ కాపునేనని వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. రేపు తాను చనిపోయినప్పుడు తన డెత్ సర్టిఫికెట్ మీద కూడా అదే ఉంటుందన్నారు. ఇదే కార్యక్రమానికి హాజరైన మంత్రి అవంతి మాట్లాడుతూ.. ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను మంత్రి పదవిలో ఉండడం వల్లే సహనంగా ఉన్నానని తీవ్ర స్వరంతో అన్నారు. జిల్లా నుంచి తనకు మాత్రమే మంత్రి పదవి దక్కిందన్నారు. కాగా, పలువురు నేతలు కాపు రిజర్వేషన్ గురించి మాట్లాడగా మంత్రి అవంతి అడ్డుకున్నారు. ఈ కార్యక్రమంలో అటువంటివి మాట్లాడడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు.