priyanka gandhi: పోలీసులు విశ్వవిద్యాలయాల్లోకి ప్రవేశించి విద్యార్థులను కొడుతున్నారు: ప్రియాంకా గాంధీ ఆగ్రహం
- పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా నిన్న ఢిల్లీలో నిరసనలు
- కేంద్ర సర్కారుపై మండిపడ్డ ప్రియాంక
- ప్రజలు, పాత్రికేయులు గళం విప్పకుండా అణచివేస్తున్నారు
- బీజేపీ తమ ఉనికిని చాటుకోవాలని ప్రయత్నించడం సిగ్గుచేటు
ఎన్డీఏ ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా నిన్న ఢిల్లీలో పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమైన విషయం తెలిసిందే. ఢిల్లీలో జామియా మిలియా ఇస్లామియా వర్సిటీ విద్యార్థులు, స్థానికులు చేపట్టిన ఈ ఆందోళన ఉద్రిక్తతకు దారి తీసింది. దీనిపై స్పందించిన కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకా గాంధీ.. కేంద్ర సర్కారుపై మండిపడ్డారు.
'పోలీసులు విశ్వవిద్యాలయాల్లోకి ప్రవేశించి విద్యార్థులను కొడుతూ కఠినంగా వ్యవహరిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రజల గొంతుకను వినాల్సి ఉంది. అయితే, ఢిల్లీ, యూపీ, ఈశాన్య రాష్ట్రాల్లో ప్రజలు, పాత్రికేయులు గళం విప్పకుండా వారిని అణచివేస్తూ బీజేపీ తమ ఉనికిని చాటుకోవాలని ప్రయత్నించడం సిగ్గుచేటు' అని ప్రియాంక ట్వీట్ చేశారు.
'కేంద్ర ప్రభుత్వం పిరికిపంద చర్యలకు పాల్పడుతోంది. భారత యువత ధైర్యాన్ని, విశ్వాసాలని కేంద్ర ప్రభుత్వం అణగదొక్కాలని ప్రయత్నిస్తోంది. ఇటువంటి చర్యలకు వారు వెనకడుగు వేయరు. మోదీజీ, ఈ రోజు కాకపోయినా రేపయినా వీరి గళాన్ని మీరు వినాల్సిందే' అని ప్రియాంకా గాంధీ విమర్శించారు.