JMI University: చట్టాన్ని వెనక్కి తీసుకుంటారా.. అధికారం నుంచి వైదొలుగుతారా?: ప్రభుత్వానికి విపక్షాల సూటి ప్రశ్న
- విద్యార్థులపై దాడిని ముక్తకంఠంతో ఖండించిన విపక్షాలు
- విద్యార్థులపై దాడి అమానుషం
- ఇది హిందూ, ముస్లింల గొడవ కాదు
పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా విపక్ష పార్టీలన్నీ ఏకమయ్యాయి. విద్యార్థులపై పోలీసులు జరిపిన దాడిపై జ్యుడీషియల్ విచారణకు ముక్తకంఠంతో డిమాండ్ చేశాయి. జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీ (జీఎంఐ)లోకి పోలీసుల ప్రవేశంపై నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పౌరసత్వ సవరణ చట్టం ఆమోదం పొందకముందు నుంచీ ఈశాన్య రాష్ట్రాల్లో దీనికి వ్యతిరేకంగా ఆందోళనలు జరుగుతున్నాయని కాంగ్రెస్ నేత గులాంనబీ ఆజాద్ అన్నారు. జీఎంఐ విద్యార్థులపై పోలీసులు వ్యవహరించిన తీరు అమానుషమన్నారు. వీసీ అనుమతి లేకుండా యూనివర్సిటీలోకి పోలీసులు ఎలా ప్రవేశిస్తారని నిలదీశారు. దీనిపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు.
శరద్ యాదవ్ మాట్లాడుతూ.. చట్టం రద్దు కావడమో, ప్రభుత్వం దిగిపోవడమో ఏదో ఒకటి జరగాలని అన్నారు. దీనిని రాజ్యాంగ సంక్షోభంగా చూడాలి తప్పితే, హిందూ.. ముస్లిం గొడవలా కాదని అన్నారు. పౌరసత్వ సవరణ చట్టాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని సమాజ్వాదీ పార్టీ నేత జావెద్ అలీ డిమాండ్ చేశారు. విద్యార్థుల ఆందోళనకు మద్దతుగా ఈ నెల 21న బిహార్లో బంద్కు పిలుపునిచ్చినట్టు ఆర్జేడీ నేత మనోజ్ ఝా తెలిపారు. పౌరసత్వ చట్టంపై అమిత్ షా అన్నీ అబద్ధాలే చెప్పారని, పార్లమెంటును తప్పుదోవ పట్టించిన ఆయన హోంమంత్రిగా ఉండడం సిగ్గుచేటని కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబాల్ తీవ్ర విమర్శలు చేశారు.