Telangana: తెలంగాణలోని ఓటర్ల ముసాయిదా జాబితా వచ్చేసింది.. జనవరి 15 వరకు అభ్యంతరాల స్వీకరణ
- రాష్ట్రంలో మొత్తం 2,98,64,689 ఓటర్లు
- ఫిబ్రవరి 7న ఓటర్ల తుది జాబితా వెల్లడి
- 34,707కు పెరిగిన పోలింగ్ కేంద్రాల సంఖ్య
తెలంగాణ రాష్ట్రంలోని మొత్తం ఓటర్ల సంఖ్య 2,98,64,689గా లెక్క తేలింది. ఇందులో ఇతర కేటగిరీలో 1566 మంది ఓటర్లు ఉన్నారు. ఈ మేరకు తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి రజత్ కుమార్ ప్రకటించారు. ముసాయిదా జాబితా ఆధారంగా 1 జనవరి 2020 నాటికి 18 ఏళ్లు నిండిన యువతీయువకులు ఓటరు జాబితాలో తమ పేర్లను నమోదు చేసుకునేందుకు ప్రత్యేక సవరణ షెడ్యూలును ప్రకటించారు. ముసాయిదా జాబితాపై వచ్చే నెల 15 వరకు అభ్యంతరాలు స్వీకరించనున్నారు. 27న వాటిపై నిర్ణయం తీసుకుని సవరించిన అనుబంధ ఓటర్ల జాబితాను ఫిబ్రవరి 4న ముద్రిస్తారు. అదే నెల 7న తుది జాబితాను విడుదల చేస్తారు. www.ceotelangana.nic.in వెబ్‌సైట్‌లో ముసాయిదా జాబితా అందుబాటులో ఉన్నట్టు రజత్‌కుమార్ తెలిపారు.
అలాగే, రాష్ట్రంలో మొత్తంగా 104 పోలింగ్ కేంద్రాలు పెరిగాయి. మల్కాజిగిరిలో ఓ పోలింగ్ కేంద్రాన్ని తొలగించారు. ఫలితంగా రాష్ట్రంలోని 33 జిల్లాల పరిధిలో పోలింగ్ కేంద్రాల సంఖ్య మొత్తంగా 34,707కు చేరింది. రాష్ట్రంలో మొత్తం ఓటర్ల సంఖ్య 2,98,64,689 కాగా, వీరిలో 1,50,07,047 మంది పురుషులు, 1,48,56,076 మంది మహిళలు, 1566 మంది ఇతరులు ఉన్నారు. అత్యధికంగా హైదరాబాద్‌లో 42,16,826 మంది ఓటర్లు ఉండగా, 30,14,147 మందితో రంగారెడ్డి జిల్లా ద్వితీయ స్థానంలో ఉంది. 2,13,404 మంది ఓటర్లతో ములుగు జిల్లా అట్టడుగున ఉంది.