Disha: దిశ చట్టం అమలు చేయకముందే విమర్శలు చేస్తారా?: టీడీపీ సభ్యులపై హోంమంత్రి అసహనం
- దిశ చట్టం తీసుకువస్తున్న ఏపీ ప్రభుత్వం
- టీడీపీ సభ్యులు దుష్ప్రచారం చేస్తున్నారన్న సుచరిత
- తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని వెల్లడి
ఏపీ ప్రభుత్వం మహిళలు, చిన్నారుల రక్షణ కోసం దిశ చట్టం తీసుకువస్తున్న సంగతి తెలిసిందే. అయితే దిశ బిల్లును ఆమోదించిన రోజునే గుంటూరులో ఓ బాలికపై అత్యాచారం జరగడం పట్ల టీడీపీ నేతలు ప్రభుత్వాన్ని ఎండగట్టారు. దీనిపై హోంమంత్రి మేకతోటి సుచరిత స్పందించారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఆమె మాట్లాడుతూ, దిశ చట్టం ఇంకా అమలు చేయలేదని, కానీ టీడీపీ సభ్యులు ఈలోపే రాద్ధాంతం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తామింకా చట్టం అమలు చేయకముందే, అందులో లోపాలున్నాయనడం సరికాదని, టీడీపీ సభ్యులు తమపై బురదజల్లేందుకే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. మహిళలు, చిన్నారుల భద్రత విషయంలో తమ ప్రభుత్వ చిత్తశుద్ధిని ఎవరూ శంకించలేరని సుచరిత ఉద్ఘాటించారు. మహిళలపై నేరాలకు కేసులు నమోదు చేయడంలేదని టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని ఆరోపించారు.