Brahmos: సముద్రంలో నిలిపి ఉంచిన ఓడను తునాతునకలు చేసిన బ్రహ్మోస్
- బ్రహ్మోస్ తాజా ప్రయోగం సక్సెస్
- ఒడిశా తీరం నుంచి పరీక్ష
- డీఆర్ డీవో ఆధ్వర్యంలో ప్రయోగం
భారత ఆయుధ సంపత్తిలో బ్రహ్మాస్త్రంగా పరిగణిస్తున్న అత్యాధునిక క్షిపణి బ్రహ్మోస్ ను మరోసారి విజయవంతంగా పరీక్షించారు. ఒడిశాలోని చాందీపూర్ పరీక్ష కేంద్రం నుంచి బ్రహ్మోస్ ప్రయోగం నిర్వహించారు. ఉపరితలంపై ఉన్న లక్ష్యాలను ఛేదించేలా డిజైన్ చేసిన ఈ సూపర్ సోనిక్ క్షిపణి ధ్వనివేగాన్ని మించిన వడితో దూసుకెళుతుంది. తాజాగా నిర్వహించిన ప్రయోగంలో సముద్రంలో సుదూరంగా నిలిపివుంచిన ఓడను బ్రహ్మోస్ విజయవంతంగా ఛేదించింది. డీఆర్ డీవో ఆధ్వర్యంలో ఈ ప్రయోగం చేపట్టారు. బ్రహ్మోస్ క్షిపణుల రేంజ్ 450 నుంచి 500 కిలోమీటర్లు! బ్రహ్మోస్ మిసైల్ ను భారత్, రష్యా సంయుక్తంగా అభివృద్ధి చేస్తున్నాయి. భారత్ లోని బ్రహ్మపుత్ర, రష్యాలోని మాస్కోవా నదుల పేర్లు కలిసేలా దీనికి బ్రహ్మోస్ అని నామకరణం చేశారు.