Andhra Pradesh: ఐదు కోట్ల జనాభా ఉన్న ఏపీకి 3 రాజధానులైతే, 20 కోట్ల జనాభా ఉన్న యూపీకి 12 రాజధానులు కావాలి: కేశినేని నాని
- ఏపీకి 3 రాజధానులు ఉండొచ్చన్న సీఎం జగన్
- స్పందించిన కేశినేని నాని
- జగన్ తుగ్లక్ ముత్తాతలాంటి వాడని ఎద్దేవా
చేతనైతే ప్రతి ఊరిని రాజధాని తరహాలో అభివృద్ధి చేయాలి కానీ, రాజధానిని మార్చడం సరికాదని టీడీపీ ఎంపీ కేశినేని నాని అభిప్రాయపడ్డారు. ఏపీకి మూడు రాజధానులు ఉండే అవకాశం ఉంది అంటూ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలపై కేశినేని నాని స్పందించారు. జగన్ అభిప్రాయం ప్రకారం ఐదు కోట్ల జనాభా ఉన్న ఏపీకి 3 రాజధానులు అవసరమైతే, 20 కోట్ల జనాభా ఉన్న ఉత్తరప్రదేశ్ కు 12 రాజధానులు కావాలని వ్యంగ్యం ప్రదర్శించారు. జగన్ వైఖరి చూస్తుంటే తుగ్లక్ ను మించిపోయి తుగ్లక్ ముత్తాతలా ఉన్నాడని విమర్శించారు. శాసనసభ్యుల బలం ఉంది కదా అని ఇష్టంవచ్చినట్టు నిర్ణయాలు తీసుకోవడం సరికాదని, ఓ ప్రకటన చేసేముందు ఆచరణ సాధ్యమో, కాదో పరిశీలించుకోవాలని హితవు పలికారు.