ACB raids on siddipeta ADCP Narasimha Reddy: ఏసీబీ వలలో అవినీతి తిమింగలం
- అక్రమాస్తుల కేసులో సిద్దిపేట ఏడీసీపీ నరసింహారెడ్డి నివాసంలో ఏసీబీ సోదాలు
- 20 ప్రాంతాల్లో ఏక కాలంలో సోదాలు నిర్వహిస్తోన్న అధికారులు
- గుర్తించిన అక్రమాస్తుల విలువ రేపు ప్రకటించే అవకాశం
అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) తనిఖీల్లో సిద్దిపేట అదనపు డీసీపీ నరసింహారెడ్డికి చెందిన అక్రమాస్తులు ఒక్కొక్కటిగా బయటపడుతున్నట్లు తెలుస్తోంది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో నరసింహారెడ్డి నివాసం, ఆయన బినామీ ఇళ్లలో కూడా అవినీతి నిరోధకశాఖ సోదాలు చేపట్టింది. సోదాలు ఈ రోజు తెల్లవారుఝామువరకు కొనసాగే అవకాశముంది.
ఇప్పటివరకు గుర్తించిన అక్రమాస్తుల విలువను ఏసీబీ అధికారులు వెల్లడించలేదు. రేపు ఈ విషయం వెల్లడించే అవకాశముంది. సిద్ధిపేట, మహబూబ్ నగర్, హైదరాబాద్, షాద్ నగర్, అయ్యవారిపల్లెతో పాటు మొత్తం 20 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు చేపట్టినట్లు తెలుస్తోంది.
నరసింహారెడ్డికి హైదరాబాద్ లో ఓ విల్లా, దాడులు కొనసాగిస్తున్న ఇతర ప్రాంతాల్లో వ్యవసాయ భూములు, ప్లాట్లు, బ్యాంకు లాకర్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారని సమాచారం. 1996 బ్యాచ్ కు చెందిన నరసింహారెడ్డి పదోన్నతి పొంది ఇన్ స్పెక్టరయ్యారు. అనంతరం సిద్దిపేటలో ఏసీపీగా పనిచేశారు. ప్రస్తుతం సిద్దిపేటలోనే లా అండ్ ఆర్డర్ విభాగం అదనపు డీసీపీగా పనిచేస్తున్నారు.