Amaravathi: రాజధానిని తరలించొద్దు...అమరావతినే అభివృద్ధి చేయాలి: హైకోర్టులో పిటిషన్ దాఖలు
- ఈ మేరకు సీఆర్‌డీఏను ఆదేశించాలని కోరిన రైతులు
- కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించిన కోర్టు
- విచారణ నాలుగు వారాలు వాయిదా
రాజధాని అమరావతిని తరలించవద్దని, ఇప్పటికే పేర్కొన్న చోట అభివృద్ధి చేయాలని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఇప్పటికే రాజధానిని నిర్ణయించి భూమిపూజ కూడా చేశారని, కొన్ని భవన నిర్మాణాలు కూడా జరుగుతున్నందున ఈ తరుణంలో తరలించకుండా సీఆర్‌డీఏను ఆదేశించాలని కోరుతూ పలువురు రైతులు ఈ పిటిషన్ దాఖలు చేశారు.
పిటిషన్ స్వీకరించిన కోర్టు దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని సీఆర్డీఏను ఆదేశించింది. పిటిషన్ పై విచారణను నాలుగు వారాలపాటు వాయిదా వేసింది. అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రంలో పరిపాలనా వికేంద్రీకరణ కోసం మూడు చోట్ల రాజధానుల నిర్మాణం జరిపే అవకాశం ఉందంటూ చెప్పిన విషయం తెలిసిందే. ఈ ప్రకటన వెలువడినప్పటి నుంచి రైతులు అమరావతిలో ఆందోళన చేస్తున్నారు. గురువారం రాజధాని పరిధిలోని 26 గ్రామాల బంద్ కు పిలుపునిచ్చారు.