Andhra Pradesh: హైకోర్టుతో టీ షాపులు, జిరాక్స్ సెంటర్లే వస్తాయి.. మాకు నాలుగో రాజధాని కావాలి: రాయలసీమ పోరాట సమితి
- తిరుపతిని ఆధ్యాత్మిక రాజధానిగా ప్రకటించాలి
- వాటికన్ తరహాలో అభివృద్ధి చేయాలి
- లేని పక్షంలో పోరాటాన్ని ఉద్ధృతం చేస్తాం
రాష్ట్రానికి మూడు రాజధానులు రావచ్చంటూ ముఖ్యమంత్రి జగన్ చేసిన ప్రకటన సంచలనంగా మారింది. ఆయన ప్రకటనతో రాజకీయ వేడి ఒక్కసారిగా పెరిగింది. కర్నూలుకు హైకోర్టు అనే ప్రకటనతో అక్కడి లాయర్లు సంబరాలు చేసుకుంటుండగా... హైకోర్టుతో తమకు ఒరిగేదేమీ లేదని రాయలసీమ పోరాట సమితి అసంతృప్తిని వ్యక్తం చేసింది. హైకోర్టును ఏర్పాటు చేయడం వల్ల టీ షాపులు, జిరాక్స్ సెంటర్లు తప్ప ఏమీ రావని అన్నారు. రాయలసీమలో నాలుగో రాజధానిని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసింది.
తిరుపతిని ఆధ్యాత్మిక రాజధానిగా ప్రకటించాలని రాయలసీమ పోరాట సమితి కోరింది. వాటికన్ సిటీ తరహాలో అభివృద్ధి చేయాలని డిమాండ్ చేసింది. తమ న్యాయబద్ధమైన డిమాండ్ ను నెరవేర్చాలని రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి కోరారు. లేని పక్షంలో పోరాటాన్ని ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.