CAA: పౌరసత్వ సవరణ చట్టాన్ని అమలు చేసి తీరుతాం.. ఎన్నార్సీ కూడా తెస్తాం!: జేపీ నడ్డా
- వలస వచ్చిన మైనార్టీ శరణార్థులను కలిస్తే వారి కష్టాలేంటో తెలుస్తాయి
- సిక్కు శరణార్థుల కష్టాలను తెలుసుకున్నానన్న నడ్డా
- 30 ఏళ్ల క్రితం దేశంలోకి వచ్చిన మైనార్టీలు దుర్బర పరిస్థితుల్లో ఉన్నారు
పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)పై విపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని బీజేపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డా మండిపడ్డారు. ఈ విషయంలో బీజేపీయేతర పార్టీలు ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నాయని విమర్శించారు. మూడు దేశాల నుంచి భారతదేశానికి వలస వచ్చిన మైనార్టీ శరణార్థులను కలిస్తే వారి కష్టాలేంటో తెలుస్తాయని అన్నారు.
ఈ రోజు ఆయన ఆఫ్ఘనిస్తాన్ నుంచి వలసొచ్చిన సిక్కు శరణార్థులను కలిశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘పౌరసత్వ సవరణ చట్టాన్ని అమలు చేసి తీరుతాం. 30 ఏళ్ల క్రితం దేశంలోకి వచ్చిన ఆయా దేశాల మైనార్టీలు దుర్బర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. వారికి భారత పౌరసత్వం లేనందున ఇక్కడ ఇళ్లు కట్టుకోలేరు. పాఠశాలల్లో వారి పిల్లలను చేర్చలేరు. ఇలాంటివేవీ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నపార్టీలకు పట్టవు. వారికి కావాల్సిందల్లా రాజకీయమే’ అంటూ దుయ్యబట్టారు.
పౌరసత్వ చట్టం తర్వాత, అక్రమంగా దేశంలో ఉంటున్న వలసదారులను గుర్తించి తిరిగి వారిదేశాలకు పంపించే ఎన్నార్సీ కూడా తీసుకొస్తామన్నారు. మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం దేశాన్ని అభివృద్ధి బాటలో పయనింపచేస్తోందన్నారు.