elgar parishat case: మానవ బాంబుతో మోదీ హత్యకు కుట్ర: వరవరరావు, మరో 18 మందిపై పూణె పోలీసుల చార్జిషీట్
- ఎల్గార్ పరిషత్ కేసులో 19 మంది పై అభియోగాలు
- రాజీవ్ తరహాలో హత్యకు మావోయిస్టుల పథకం
- దానికి సహకారం అందించిన హక్కుల నేతలు
తమిళనాడులోని శ్రీపెరంబదూరులో ఎల్టీటీఈ ఉగ్రవాదులు రాజీవ్ గాంధీని హతమార్చిన మాదిరిగానే ప్రధాని నరేంద్రమోదీ రోడ్డు షో జరిపేటప్పుడు హతమార్చేందుకు మావోయిస్టులు పథక రచన చేశారని ఎల్గార్ పరిషత్ కేసులో పోలీసులు చార్జిషీట్ దాఖలు చేశారు.
ఈ పథకం అమలు కోసం ఎనిమిది కోట్ల రూపాయల నిధులు, ఓ అత్యాధునిక ఎం-4 రైఫిల్, నాలుగు లక్షల రౌండ్ల మందుగుండు, మరికొన్ని మారణాయుధాలను ఓ సరఫరాదారుడి నుంచి కొని నేపాల్, మణిపూర్ మీదుగా తెచ్చేందుకు ప్రయత్నించారంటూ పోలీసులు చార్జిషీట్లో ఆరోపించారు.
కేంద్ర ప్రభుత్వంతోపాటు మహారాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా కూల్చివేసేందుకు కుట్ర జరిగిందని, మావోయిస్టుల యాక్షన్ ప్లానుకు వరవరరావు, మరో 18 మంది హక్కుల నేతలు సహకారం అందించారని చార్జిషీట్లో పేర్కొన్నారు. పూణెలోని చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (యూఏపీఏ)లో ఈ చార్జిషీట్ దాఖలయింది.
2017 డిసెంబరు 31న భీమా కోరెగాం ప్రాంతంలో మావోయిస్టులు ఏర్పాటు చేసిన ఎల్గార్ పరిషత్ సమావేశంలో ఈ మేరకు పథక రచన జరిగిందన్నది పోలీసుల అభియోగం. ఈ పథకానికి హక్కుల నేతలు వరవరరావు, సుధీర్ ధవలే, రోనావిల్సన్, సురేంద్రగార్లింగ్, మహేష్ రౌత్, సోమాసేన్, అరుణ్ ఫెరీరా, వెర్మన్ గోంసాల్వెస్, సుధాభరద్వాజ్ ల సహకారం ఉందన్నారు.
ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి పోలీసులు వరవరరావుతోపాటు మొత్తం తొమ్మిది మందిని రిమాండుకు పంపిన విషయం తెలిసిందే. పోలీసులు దాఖలు చేసిన చార్జిషీట్ ను ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి పరిశీలించి అభియోగాల నమోదుకు ఆదేశాలిస్తే తదుపరి విచారణ సాగుతుంది.