Assom: అసోం ప్రజల హక్కులకు భంగం కలుగదు: సీఎం సోనోవాల్
- మన భాషకుగానీ, ఉనికికి గానీ ఎలాంటి ముప్పు వాటిల్లదు
- ప్రజల సహకారంతో రాష్ట్రంలో శాంతియుత వాతావరణం నెలకొల్పుతాం
- ఇంటర్నెట్ సర్వీసులను పునరుద్ధరించిన అధికారులు
పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా వెల్లువెత్తుతోన్న ఆందోళనల నేపథ్యంలో అసోం ముఖ్యమంత్రి శర్బానంద సోనోవాల్ స్పందించారు. అసోం ప్రజల హక్కుల్ని ఎవరూ హరించలేరని పేర్కొన్నారు. గత కొన్ని రోజులుగా ఈశాన్య రాష్ట్రాల్లో కొనసాగుతున్న ఆందోళనలు ఉద్రిక్తంగా మారాయి. అసోంలో కూడా ప్రజలు ఆందోళనను తీవ్రం చేశారు. తమ భాష, సంస్కృతిని కాపాడాలంటూ డిమాండ్ చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఆ రాష్ట్ర సీఎం ప్రజలకు భరోసా కల్పిస్తూ మాట్లాడారు.‘అసోం గడ్డపై జన్మించిన బిడ్డల హక్కుల్ని ఏ ఒక్కరూ హరించలేదు. మన భాషకుగానీ, ఉనికిగానీ ఎలాంటి ముప్పు వాటిల్లదు. అసోం గౌరవానికి ఏ విధంగానూ విఘాతం కలగదు. ప్రజల సహకారంతో రాష్ట్రంలో శాంతియుత వాతావరణం నెలకొల్పుతూ ముందుకు సాగుతాం’ అని చెప్పారు. ఇదిలా ఉండగా, నిరసనల నేపథ్యంలో పదిరోజులుగా రాష్ట్రంలో నిలిపివేసిన ఇంటర్నెట్ సర్వీసులను పునరుద్ధరిస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.