Unnavo: ఎట్టకేలకు శిక్ష పడింది.... ఉన్నావో ఘటన దోషి కుల్దీప్ సెంగార్ కు యావజ్జీవం
- రెండేళ్ల కిందట ఉన్నావోలో అత్యాచార ఘటన
- అనేక మలుపులు తిరిగిన కేసు
- ఎమ్మెల్యేను దోషిగా నిర్ధారించిన న్యాయస్థానం
- శిక్ష విధిస్తూ తాజా తీర్పు
రెండేళ్ల కిందట ఉత్తరప్రదేశ్ లోని ఉన్నావోలో ఓ మైనర్ బాలికపై అత్యాచారం చేసిన కేసులో బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్ సెంగార్ కు యావజ్జీవ కారాగార శిక్ష విధించారు. 2017లో ఉద్యోగం కోసం వెళ్లిన బాలికను కుల్దీప్ సెంగార్ తన కామవాంఛలకు బలిచేశాడు. అయితే ఈ వ్యవహారం అనేక మలుపులు తిరిగింది. సెంగార్ పై కేసులు నమోదు చేయకపోగా బాధితురాలి తండ్రిపై అక్రమంగా ఆయుధాలు కలిగివున్నాడంటూ కేసు నమోదు చేశారు. బాధితురాలు సీఎం నివాసం ముందు న్యాయం కావాలంటూ ఆత్మహత్యకు కూడా ప్రయత్నించింది. ఈ ఘటన తర్వాత ఆమె తండ్రి పోలీసు కస్టడీలోనే ప్రాణాలు వదిలాడు. తదనంతర పరిణామాల నేపథ్యంలో కుల్దీప్ సెంగార్ ను అరెస్ట్ చేశారు.
అయితే కోర్టుకు తన బంధువులతో కలిసి వెళుతుండగా, బాధితురాలు ప్రయాణిస్తున్న వాహనాన్ని లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో బాధితురాలి బంధువులు ఇద్దరు మృతి చెందారు. మొత్తమ్మీద ఇన్నాళ్లకు బాధితురాలికి న్యాయం జరిగింది. ఢిల్లీలోని తీస్ హజారీ న్యాయస్థానం సెంగార్ ను దోషిగా నిర్ధారించడంతో పాటు, తాజాగా యావజ్జీవం విధిస్తూ తీర్పునిచ్చింది. అంతేకాకుండా, బాధితురాలికి రూ.10 లక్షల నష్టపరిహారం, విచారణ ఖర్చుల కింద రూ.15 లక్షలు చెల్లించాలని ఆదేశించింది. బాధితురాలి కుటుంబం సురక్షితంగా నివసించేలా చర్యలు తీసుకోవాలంటూ ఆ బాధ్యతను సీబీఐకి అప్పగించింది.