Andhra Pradesh: అమరావతిలో అసెంబ్లీ, రాజ్ భవన్, మినిస్టర్స్ క్వార్టర్స్ ఉండాలని సూచించాం: జీఎన్ రావు
- విశాఖలో సచివాలయం, సీఎం క్యాంపు కార్యాలయం
- కర్నూలులో హైకోర్టు
- అమరావతి, విశాఖలో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని సూచించాం
ఏపీని పరిపాలనాపరంగా నాలుగు ప్రాంతాలుగా విభజించి అభివృద్ధి చేయాలని తమ నివేదికలో సూచించామని జీఎన్ రావు తెలిపారు. ఏపీ రాజధానిపై నియమించిన జీఎన్ రావు కమిటీ తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించిన అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జీఎన్ రావు మాట్లాడుతూ, నాలుగు ప్రాంతీయ అభివృద్ధి మండళ్లకు నిపుణుల కమిటీ సిఫారసు చేసినట్టు చెప్పారు. ఉత్తరాంధ్ర, మధ్య కోస్తా, దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాలుగా విభజించి అభివృద్ధి చేయాలని సూచించామని చెప్పారు.
అమరావతిలో అసెంబ్లీ, రాజ్ భవన్, మినిస్టర్స్ క్వార్టర్స్ ఉండాలని, వేసవికాలంలో మాత్రం అసెంబ్లీ సమావేశాలను విశాఖలో నిర్వహించాలని తమ నివేదికలో సూచించినట్టు చెప్పారు. విశాఖలో సచివాలయం, సీఎం క్యాంపు కార్యాలయం, కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలని, తుళ్లూరు ప్రాంతంలో వివిధ ప్రభుత్వ శాఖల కార్యాలయాల ఏర్పాటుకు సిఫారసు చేసినట్టు చెప్పారు. అదేవిధంగా, అమరావతి, విశాఖలో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని, అమరావతిలో భూములు ఇచ్చిన రైతులకు అన్ని విధాలుగా భూమిని అభివృద్ధి చేసి ఇవ్వాలని తమ నివేదికలో చెప్పినట్టు తెలిపారు.
నాలుగు ప్రాంతీయ అభివృద్ధి మండళ్ల వివరాలు..
ఉత్తరాంధ్ర: శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్టణం
మధ్య కోస్తా: ఉభయగోదావరి జిల్లాలు, కృష్ణా
దక్షిణ కోస్తా: గుంటూరు, ప్రకాశం, నెల్లూరు
రాయలసీమ: చిత్తూరు, కడప, కర్నూలు, అనంతపురం