CAA-NRC: కొందరు కావాలనే హింసను ప్రేరేపిస్తున్నారు: కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్
- పౌరసత్వ సవరణ చట్టంపై అపోహలు అనవసరం
- హింసకు పాల్పడేవారిని చూస్తూ ఊరుకోవాలా?
- ఎన్నార్సీ కులాలు, మతాలు, వర్గాలకు సంబంధించినది కాదు
పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) పై అపోహలు అవసరంలేదని కేంద్రమంత్రి నిర్మల సీతారామన్ అన్నారు. సీఏఏ, ప్రతిపాదిత ఎన్నార్సీని వ్యతిరేకిస్తూ జరుగుతున్న ఆందోళనలపై నిర్మల స్పందించారు. కొందరు కావాలనే ప్రజల్లో అపోహలు సృష్టించి హింసను ప్రేరేపిస్తున్నారన్నారు. హింసకు పాల్పడేవారిని చూస్తూ ఊరుకోవాలా? అంటూ ప్రశ్నించారు.
ఆర్థికమాంద్యం నుంచి పక్కదారి పట్టించడానికి ప్రభుత్వమే జనాన్ని రెచ్చగొడుతోందన్న ప్రతిపక్షాల ఆరోపణలపై మంత్రి చెబుతూ... ఇక్కడ విపక్షాలే ప్రజలను రెచ్చగొడుతున్నాయన్నారు. ఇంకా అమల్లోకి రాని చట్టాన్ని వివాదాస్పదం చేయడం సరికాదన్నారు. పౌరసత్వ చట్ట సవరణతో దేశంలో ఏ ఒక్క పౌరుడికి నష్టం జరగదని పేర్కొన్నారు.
ఎన్నార్సీపై ఇప్పటివరకు ఎలాంటి విధివిధానాలు లేవన్నారు. అమలుకు సంబంధించి కూడా ఎలాంటి స్పష్టత లేదని చెప్పారు. ఎవరూ ఎలాంటి ఆధారాలు చూపించాల్సిన అవసరంలేదన్నారు. ఎన్నార్సీ కులాలు, మతాలు, వర్గాలకు సంబంధించినది కాదని తెలిపారు. పౌరసత్వ చట్ట సవరణతో దేశ పౌరులకు నష్టంలేదన్నారు. కొన్ని దేశాల్లో హింసను ఎదుర్కోలేక వచ్చినవారికి మనదేశం పౌరసత్వం ఇస్తుందన్నారు. శ్రీలంక, ఉగాండా నుంచి వచ్చిన వారికి అవకాశమిచ్చినవారే ఈ రోజు వ్యతిరేకిస్తున్నారని మండిపడ్డారు.