Amaravathi: అమరావతిలో మోదీ శంకుస్థాపన చేసిన ప్రాంతంలో నేడు రాజధాని రైతుల వంటావార్పు
- నేటి కార్యాచరణను ప్రకటించిన జేఏసీ
- తుళ్లూరు, మందడం, రాయపూడి, పెద్దపరిమిలో మహాధర్నా
- పాల్గొననున్న 29 గ్రామాల రైతులు
మూడు రాజధానుల ప్రకటనపై మండిపడుతున్న అమరావతి ప్రాంత రైతులు తమ ఆందోళనను మరింత ఉద్ధృతం చేయాలని నిర్ణయించారు. ప్రభుత్వం తన ప్రకటనను వెనక్కి తీసుకునేంత వరకు వెనక్కి తగ్గబోమని తేల్చి చెప్పారు. ఏపీ రాజధానిగా అమరావతిని కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నేటి ఉద్యమ కార్యాచరణను రాజధాని ఐక్య కార్యాచరణ సమితి ప్రకటించింది.
ఆందోళనల్లో భాగంగా నేటి ఉదయం 8:30 గంటలకు ఉద్దండరాయునిపాలెంలో ప్రధాని నరేంద్రమోదీ అప్పట్లో శంకుస్థాపన చేసిన ప్రదేశంలో వంటావార్పు కార్యక్రమం చేపట్టనున్నారు. అదే సమయంలో తుళ్లూరు, మందడం, రాయపూడి, పెద్దపరిమిలలో మహా ధర్నా చేపట్టాలని నిర్ణయించారు. ఈ నిరసన కార్యక్రమాల్లో రాజధాని ప్రాంతంలోని 29 గ్రామాల రైతులు పాల్గొంటారని జేఏసీ నేతలు పేర్కొన్నారు.