Sasikala: నోట్ల రద్దు వేళ తెగ ఆస్తులు కొనేసిన శశికళ... ఐటీ విచారణలో వెల్లడి!
- పలు ప్రాంతాల్లో మాల్స్, భవంతులు
- కోయంబత్తూరులో 50 సోలార్ విద్యుత్ ప్లాంట్లు
- అన్ని లావాదేవీలూ నగదుతోనే
- మద్రాస్ హైకోర్టుకు తెలిపిన ఐటీ శాఖ
తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత ప్రాణ స్నేహితురాలు శశికళ, పెద్ద నోట్లను రద్దు చేసిన సమయంలో భారీఎత్తున ఆస్తులను కూడబెట్టినట్టు ఆదాయపు పన్ను శాఖ అధికారులు తేల్చారు. నోట్లను రద్దు చేసిన తరువాత, ఆమె పలు ప్రాంతాల్లో మాల్స్, భవంతులను కొన్నారని గుర్తించారు. పెరోల్ పై బయటకు వచ్చిన సమయంలోనూ ఆస్తి లావాదేవీలు జరిగాయని ఐటీ అధికారులు మద్రాస్ హైకోర్టుకు తెలిపారు. తన ఆదాయ వ్యవహారాలకు సంబంధించి దాఖలైన పిటిషన్ పై స్టే విధించాలంటూ, శశికళ రిట్ ను దాఖలు చేయగా, న్యాయమూర్తి అనితా సుధాకర్ ఈ పిటిషన్ ను విచారించారు.
కాగా, ఇదే కేసులో వాదనలు వినిపించిన శశికళ తరఫు న్యాయవాది, తమ క్లయింట్ ఆస్తుల వ్యవహారం ముగిసిపోయిందని, ఇప్పుడు విచారణే అవసరం లేదని వాదించారు. ఇదే సమయంలో ఐటీ శాఖ న్యాయవాది కల్పించుకుని శశికళ, ఆస్తులు పెరిగిన విధానంపై ఆధారాలు సమర్పించారు. చెన్నై పెరంబూరు, మదురై, కేకే నగర్ ప్రాంతాల్లో షాపింగ్ మాల్స్, పుదుచ్చేరిలో ఒక రిసార్ట్, కోయంబత్తూరులో పేపర్ మిల్, చెన్నైలో చక్కెర మిల్లు, పాత మహాబలిపురం రోడ్డులో సాఫ్ట్ వేర్ కంపెనీ, కోయంబత్తూరులో 50 సోలార్ విద్యుత్ ప్లాంట్ లను ఆమె కొన్నారని, ఇవన్నీ నగదు బట్వాడా ద్వారా జరిగాయని వాదించారు. ఆపై తదుపరి విచారణను వాయిదా వేస్తున్నట్టు న్యాయమూర్తి ప్రకటించారు.