GVL: మత రాజకీయాలకు హైదరాబాద్ అడ్డా.. ఒవైసీ చర్య శుభపరిణామం: జీవీఎల్
- జాతీయ గీతంతో ఒవైసీ ప్రసంగాన్ని ముగించడం శుభపరిణామం
- రాజకీయ మనుగడ కోసమే కాంగ్రెస్ రాద్ధాంతం
- పౌరసత్వ చట్టాన్ని వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదు
మత రాజకీయాలకు హైదరాబాద్ అడ్డాగా మారిందని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పౌరసత్వ సవరణ చట్టంపై బీజేపీ ఆధ్వర్యంలో హైదరాబాద్లోని కత్రియ హోటల్లో నిన్న మేధావుల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జీవీఎల్ మాట్లాడుతూ.. పౌరసత్వ సవరణ చట్టాన్ని వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదన్నారు. రాజకీయ మనుగడ కోసమే ఈ చట్టంపై కాంగ్రెస్ అనవసర రాద్ధాంతం చేస్తోందని మండిపడ్డారు. దేశంలో జరుగుతున్న హింసకు కాంగ్రెస్సే కారణమని ఆరోపించారు. కాంగ్రెస్ పాకిస్థాన్ తొత్తులా వ్యవహరిస్తోందని మండిపడ్డారు.
దేశంలోని ప్రతీ ముస్లిం ఇల్లుపైనా జాతీయ జెండా ఎగరాలని, అది ప్రధాని మోదీ, కేంద్రమంత్రి అమిత్ షాలు చూడాలంటూ హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ చేసిన వ్యాఖ్యలపైనా జీవీఎల్ స్పందించారు. ఆయన అలా అనడానికి బీజేపీనే కారణమన్నారు. అసద్ తన ప్రసంగాన్ని జాతీయ గీతాలాపనతో ముగించడం శుభపరిణామమని జీవీఎల్ అన్నారు.