YCP Minister Botsa Satyanarayana Media conference: మేము కస్టోడియన్లము మాత్రమే: ఏపీ మంత్రి బొత్స
- రాష్ట్రాభివృద్ధి చేయమని ప్రజలు మమ్మల్ని ఎన్నుకున్నారు
- ప్రజలకు ఉపయోగకరం అయితే తప్ప.. టీడీపీ విధానాలను కొనసాగించం
- టీడీపీ విధానాలు నచ్చకనే ప్రజలు ఆ పార్టీని ఓడించారు
రాష్ట్ర సమగ్రాభివృద్ధే తమ ప్రభుత్వ ధ్యేయమని వైసీసీ నేత, ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఈ రోజు ఆయన విశాఖపట్టణంలో మీడియాతో మాట్లాడుతూ, కేబినెట్ భేటీలో మాట్లాడిన తర్వాత మూడు రాజధానుల అమలు ప్రక్రియ వెల్లడిస్తామని చెప్పారు. ప్రాంతీయ అసమానతలు ఉండకూడదనే కమిటీ వేశాం. గతంలో ఇచ్చిన శ్రీకృష్ణ కమిటీ, శివరామకృష్ణ, తాజాగా జీఎన్ రావు కమిటీలు ఇచ్చిన నివేదికల మధ్య సామీప్యత ఉందన్నారు. వాటి ప్రకారమే తమ ప్రభుత్వం నడుస్తోందన్నారు.
'రాష్ట్రాభివృద్ధి చేయాలని ప్రజలు మమ్మల్ని ఎన్నుకున్నారు. మేము కస్టోడియన్లము మాత్రమే'నని అన్నారు. అందులో భాగంగానే పరిపాలన వికేంద్రీకరణ చేస్తున్నామన్నారు. రాజధాని పేరుతో దోపిడీకి బీజం వేసింది టీడీపీ ప్రభుత్వమేనని విమర్శించారు. ప్రజలకు ఉపయోగకరం అయితే తప్ప టీడీపీ విధానాలను కొనసాగించమన్నారు. ప్రజలు తమను 150కి పైగా సీట్లలో గెలిపించారని, తమ సిద్ధాంతాలు నచ్చే గెలిపించారని, టీడీపీ విధానాలు నచ్చకనే ఆ పార్టీని ఓడించారని అన్నారు. 13 జిల్లాల అభివృద్ధే లక్ష్యంగా సీఎం జగన్ నిర్ణయం తీసుకుంటారని బొత్స చెప్పారు.
మరో ప్రభుత్వం వస్తే.. మళ్లీ రాజధాని మారుస్తారేమో అన్న ఓ మీడియా ప్రతినిధి సందేహానికి.. బొత్స సమాధానమిస్తూ.. కేంద్రంలో మోదీ ప్రభుత్వాన్ని ఉదహరించారు. ‘మోదీ పెద్ద నోట్లను ఉససంహరించారు. అప్పుడు కూడా ఓ మీడియా ప్రతినిధి ఇదే రీతిలో ప్రశ్నించారు. ఇంకో ప్రభుత్వం వస్తే.. మరో నోట్ ను రద్దు చేస్తానంటే.. దానికేం చేస్తాం. మన విధానం అలా ఉంది. రాజ్యాంగం అవకాశం కల్పించింది. రాజ్యాంగం, ప్రజల నాడి ప్రకారం ముందుకెళతాం’ అని బొత్స అన్నారు.